భార్య-తమన్నా.. సుక్కు చూపించిన తేడా

Update: 2017-08-03 10:26 GMT
సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ సినిమా ట్రైలర్లో.. అందులో దర్శకుడనేవాడు ఎంత స్వార్థంతో ఆలోచిస్తాడో చూపించడం గమనించవచ్చు. దర్శకుడు తన వ్యక్తిగత జీవితంలో ఏ చిన్న అనుభవం ఎదురైనా దాన్ని సినిమా కోసమే ఉపయోగించుకుంటాడని.. సినిమాకే చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని అందులో చూపించారు. మరి దర్శకులు నిజంగా అంత స్వార్థంగా ఉంటారా అని సుకుమార్ ను అడిగితే.. అవునంటున్నాడతను. స్వయంగా తాను సినిమా విషయంలో చాలా స్వార్థంతో ఆలోచిస్తానని చెబుతూ.. అందుకు నిజ జీవితంలోని ఒక ఉదాహరణను చెప్పాడు.

‘‘దర్శకులనేవాళ్లు స్వార్థంతో ఆలోచించాలి. ఓసారి నా భార్య నన్ను షాపింగుకి రమ్మంది. రెండు మూడు చీరలు చూపించి... ఏది తీసుకోవాలో అడిగింది. నీ ఇష్టం.. అన్నీ బాగున్నాయ్ అనేశాను. రెండు నిమిషాల్లో మా షాపింగ్ అయిపోయింది. కానీ 100 పర్సంట్ లవ్ సినిమా షూటింగ్ సందర్భంగా తమన్నాకు ఏ చీర కట్టించాలనే  విషయంలో రోజంతా ఆలోచించాను. నిజ జీవితానికి.. సినిమాకు అంత తేడా చూపిస్తాను’’ అని సుకుమార్ తెలిపాడు.

ఇక ‘దర్శకుడు’ సినిమా తన కథే అనే ప్రచారంలో వాస్తవం లేదని.. అలాగే ఈ సినిమా స్క్రిప్టులో తాను ఎంత మాత్రం జోక్యం చేసుకోలేదని సుకుమార్ చెప్పాడు. ఈ కథలో తాను ఎలాంటి మార్పులు చేయలేదని.. ఒక్క రోజు కూడా సెట్ కు వెళ్లలేదని తెలిపాడు. ఐతే సుకుమార్ కథ-స్క్రీన్ ప్లే రాశాడనే జనాలు ‘కుమారి 21 ఎఫ్’ మీద ఆసక్తి చూపించారు. మరి  సుకుమార్ ముద్ర అసలేమాత్రం లేని ‘దర్శకుడు’పై ఇప్పుడు ఆడియన్స్ ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నదే డౌటు.
Tags:    

Similar News