మలేషియాలో జననాయకుడి ఫ్యాన్స్ ఉద్వేగం
దళపతి విజయ్ వీరాభిమానుల భావోద్వేగం, దూకుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ ఫేవరెట్ హీరో కోసం తంబీలు చెవులు కోసుకుంటారు.;
దళపతి విజయ్ వీరాభిమానుల భావోద్వేగం, దూకుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ ఫేవరెట్ హీరో కోసం తంబీలు చెవులు కోసుకుంటారు. అతడు నటనను విరమించి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతుంటే అది చాలా మందికి మింగుడుపడటం లేదు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లినా తిరిగి నటించాలని కోరుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. అయితే దళపతి విజయ్ రాజకీయాల్లో భళ్లూక పట్టు పట్టాలనే బలమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు. అతడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్ఠాత్మక తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యర్థులపై నెగ్గి ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్నాడు. దానికి అనుగుణంగానే అతడు సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి పావులు కదుపుతున్నాడు.
విజయ్ ప్రస్తుతం తన కెరీర్ చిట్టచివరి సినిమాలో నటిస్తున్నాడు. దీనికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. జననాయగన్ అనేది టైటిల్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. దళపతికి నటుడిగా ఇదే చివరి చిత్రం కానుందని, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారని చెబుతున్నందున, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జన నాయగన్ విజయ్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. దీనిని కేవలం సినిమాగా మాత్రమే అభిమానులు చూడరు. ఆడియో రోజు, దీనిని అరుదైన భావోద్వేగ క్షణంగా భావిస్తారు. దీని కారణంగా జననాయగన్ సినిమాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రేక్షకులు, పత్రికలు నిశితంగా గమనిస్తున్నాయి.
`జననాయగన్` ఆడియో విడుదల కార్యక్రమం రేపు (డిసెంబర్ 27) మలేషియాలో అత్యంత భారీగా జరగనుంది. కౌలాలంపూర్‌లోని చారిత్రాత్మక బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియం ఈ పండుగకు వేదిక. ఈ కార్యక్రమానికి దాదాపు 80,000 మంది అభిమానులు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో విజయ్ ఈరోజు చెన్నై విమానాశ్రయానికి చేరుకుని ప్రైవేట్ జెట్‌లో మలేషియాకు బయలుదేరారు. ఆయన ప్రయాణానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా మలేషియాకు ప్రయాణిస్తున్నారు.
తమిళగ వెట్రి కజగం ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, దర్శకుడు నెల్సన్, దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ కూడా ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. నటుడు-కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, దర్శకుడు నెల్సన్, గాయకులు ఎస్. పి. బి. చరణ్, కృష్ణ, హరీష్ రాఘవేంద్ర, టిప్పు, గాయనీమణులు అనురాధ శ్రీరామ్, సుజాత మోహన్ మలేషియాకు ప్రయాణిస్తున్నారు. నిర్మాణ సంస్థ వారి ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది. ధనుష్, ఇతర తారలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. విజయ్ ఇప్పటికే మలేషియాకు ప్రయాణించడంతో, అభిమానులు కూడా `జన నాయగన్` ఆడియో విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లో ఒక భావోద్వేగభరితమైన చిరస్మరణీయమైన కార్యక్రమంగా నిలుస్తుందని అభిమానులంతా ఉత్సాహంగా వేచి చూస్తున్నారు.
ఇదే చివరి సినిమా అని తెలియగానే ఇంతకుముందు విజయ్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. విజయ్ అభిమానులు ఓచోట గుమిగూడి తమ విచారాన్ని వ్యక్తం చేసిన ఫోటోలు, వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఆడియో వేదిక సాక్షిగా మరోసారి అలాంటి దృశ్యాల్ని అభిమానులు చూడటం ఖాయంగా కనిపిస్తోంది.