వెన‌క నుంచి వీడియో తీయ‌కండి.. ఫోటోగ్రాఫ‌ర్‌కి న‌టి వార్నింగ్

స్టార్ల‌తో స‌న్నిహితంగా మెల‌గుతూ, వారిని అందంగా చిత్రీక‌రించాల‌నే త‌ప‌న స్టిల్ పోటోగ్రాఫ‌ర్ల‌కు ఉండ‌వ‌చ్చు.;

Update: 2026-02-14 19:30 GMT

స్టార్ల‌తో స‌న్నిహితంగా మెల‌గుతూ, వారిని అందంగా చిత్రీక‌రించాల‌నే త‌ప‌న స్టిల్ పోటోగ్రాఫ‌ర్ల‌కు ఉండ‌వ‌చ్చు. కానీ ఒక్కోసారి హ‌ద్దు మీరి ప్ర‌వ‌ర్తిస్తే మాత్రం అది అభాసుపాల‌వుతోంది! అలాంటి ఫోటోగ్రాఫ‌ర్ల‌పై విరుచుకుప‌డే భామ‌లు ఉన్నారు. తాజాగా ఓ ఫోటోగ్రాఫ‌ర్ ని నిల‌దీస్తూ.. డ్యాన్సింగ్ క్వీన్ ఆయేషా ఖాన్ ఫైరైన ఘటన ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవ‌ల ముంబైలో జరిగిన `తు యా మే` సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. స్క్రీనింగ్ కోసం వచ్చిన ఆయేషా ఖాన్ రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు పోజులు ఇస్తుండగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెను వెనుక వైపు నుండి వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన ఆయేషా వెంటనే అసహనం వ్యక్తం చేస్తూ వారిని నిలదీశారు.

స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌ను అయేషా సున్నితంగా హెచ్చరించారు. అప్ ఇజ్జత్ కూడా ఖుద్ కమాయేంగే, ఔర్ ఖుద్ హీ గవ్వాయేంగే... ప్లీజ్ మత్ కరియే, అచ్చా నహీ లగ్తా.. అని హిందీలో వ్యాఖ్యానించారు. దీని అర్థం.. గౌరవాన్ని మీరే సంపాదించుకుంటారు.. మీరే పోగొట్టుకుంటారు... దయచేసి ఇలా చేయకండి.. ఇది పద్ధతి కాదు! అని హెచ్చరించారు.

అయేషా అభ్యంత‌రానికి కార‌ణాలు లేక‌పోలేదు. నిజానికి ఇప్ప‌టి సోష‌ల్ మీడియా యుగంలో ఫోటోగ్రాఫ‌ర్లు లేదా వీడియోలు షూట్ చేసే వ్య‌క్తులు హద్దులు మీరుతున్న తీరు షాకిస్తోంది. సెలబ్రిటీల వ్యక్తిగత ప్రైవసీని గౌరవించకుండా.. అసభ్యకరమైన యాంగిల్స్‌లో ఫోటోలు తీయడం నిత్య‌కృత్యంగా మారింది. అందుకే అయేషా మండిపడ్డారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అయేషా ఖాన్ మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లు `ఊప్స్ మూమెంట్స్` కోసం వెతకడం.. అనుమ‌తి లేకుండా వీడియోలు తీయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఆయేషా ఖాన్ అలా స్పందించిన వెంటనే, అక్కడ ఉన్న ఇతర ఫోటోగ్రాఫర్లు కూడా ఆమెకు మద్దతు పలికారు. తప్పుగా ప్రవర్తించిన సదరు ఫోటోగ్రాఫర్‌ను అలా వీడియోలు తీయ‌డం ఆపివేయమని కోర‌డం విశేషం. సెలబ్రిటీల విష‌యంలో ఫోటోగ్రాఫ‌ర్లు ప్రవర్తించే తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయేషా ఖాన్‌కు మద్దతు తెలుపుతున్నారు. `గౌరవం ఇవ్వడం నేర్చుకోండి` అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షనాయా కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటించిన `తు యా మే` సినిమా స్క్రీనింగ్‌కు ఆయేషా ఖాన్‌తో పాటు అనన్యా పాండే, ఖుషీ కపూర్, అనిల్ కపూర్ త‌దిత‌ర‌ ప్రముఖులు హాజరయ్యారు.

అయేషా ఖాన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు చిత్రం పెద్దిలో అయేషా ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలోను అయేషా నటిస్తున్నట్లు ప్రచారం ఉంది. అటు బాలీవుడ్ లో ప‌లు చిత్రాల‌తో అయేషా బిజీ బిజీగా ఉంది.



Tags:    

Similar News