రాజాసాబ్.. ఈ అందాల రాక్షసి ఏం మాయ చేస్తుందో..
సంక్రాంతి రేసులో ఉన్న ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి గ్లామర్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ల రోల్స్ చాలా స్పెషల్ గా ఉంటాయని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు.;
సంక్రాంతి రేసులో ఉన్న ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి గ్లామర్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ల రోల్స్ చాలా స్పెషల్ గా ఉంటాయని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక మేకర్స్ మాళవిక మోహనన్ పాత్రకు సంబంధించిన ఒక లుక్ ని వదిలారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫోటోషూట్స్ తో రచ్చ చేసే మాళవిక, ఈసారి 'రాజా సాబ్' లో ఒక డిఫరెంట్ అవతార్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ లుక్ సినిమాపై నెమ్మదిగా ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో మాళవిక 'భైరవి' అనే పాత్రలో నటిస్తోంది. పోస్టర్ లో ఆమె లుక్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. నలుపు రంగు చీరకట్టులో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మోడ్రన్ టచ్ ఇచ్చారు. చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్, ఫేస్ లో ఆటిట్యూడ్ చూస్తుంటే.. ఈ పాత్రలో కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ఏదో పొగరు కూడా గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
సాధారణంగా డైరెక్టర్ మారుతి సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ కాస్త తిక్కగానో లేదా విచిత్రమైన మేనరిజమ్స్ తోనో ఉంటుంది. ఇప్పుడు 'భైరవి' అనే పవర్ఫుల్ పేరు, ఆ బ్లాక్ శారీ గెటప్ చూస్తుంటే.. ఇందులో కూడా అలాంటి ట్రీట్మెంట్ ఏదో ఉండేలా ఉంది. హారర్ కామెడీ జానర్ కాబట్టి, ఈ పాత్రకు కథలో దెయ్యాలతో ఏమైనా లింక్ ఉందా, లేక హీరోని ఆటపట్టించే పాత్రనా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్, మాళవిక మోహనన్ కాంబినేషన్ ఇదే తొలిసారి. ప్రభాస్ కటౌట్ కు సరిపోయే పర్సనాలిటీ మాళవిక సొంతం. స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందనేది చూడాలి. సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ఇతర భామలు ఉన్నా, మాళవిక పాత్రే మెయిన్ లీడ్ గా, కథను డ్రైవ్ చేసేలా ఉంటుందని పోస్టర్ చూసిన వాళ్లు అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు ప్రమోషన్స్ లో కాస్త వెనుకబడ్డ ఈ సినిమాకి, భైరవి ఎంట్రీతో గ్లామర్ డోస్ యాడ్ అయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలా కాకుండా, కాస్త కొత్తగా ట్రై చేసినట్లు కనిపిస్తోంది. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాత్ర స్వభావం గురించి, ప్రభాస్ తో ఉండే సీన్స్ గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ 'అందాల రాక్షసి' లుక్ అయితే ఆకట్టుకుంది. మరి మారుతి రాసిన ఈ క్యారెక్టర్ తో మాళవిక కేవలం పాటలకే పరిమితం అవుతుందా, లేక నటనతోనూ మెప్పిస్తుందా అనేది తెలియాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే.