జై హనుమాన్.. రెండేళ్ల ఎదురు చూపులకు తెర
రెండేళ్ల ముందు సంక్రాంతికి విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం.. హనుమాన్.;
రెండేళ్ల ముందు సంక్రాంతికి విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం.. హనుమాన్. రిలీజ్ ముంగిట దీనిపై మరీ ఎక్కువ అంచనాలేమీ లేవు. తెలుగులో అయితే అందరూ ‘గుంటూరు కారం’ మీదే దృష్టిపెట్టారు. కానీ సూపర్ స్టార్ సినిమాను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఆధిపత్యం చలాయించింది ‘హనుమాన్’.
తెలుగులోనే కాక ఇతర భాషల్లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్ల క్లబ్బులోకి కూడా అడుగు పెట్టింది. దీంతో చివర్లో లీడ్ ఇచ్చిన ‘జై హనుమాన్’ మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ‘హనుమాన్’ తర్వాత ఏవేవో ప్రాజెక్టులను లైన్లో పెట్టి.. ఏదీ ముందుకు కదలక రెండేళ్ల సమయాన్ని వృథా చేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
ఐతే ఈ మధ్యే అన్నీ పక్కన పెట్టి ‘జై హనుమాన్’ను పట్టాలెక్కించడానికి అతను సన్నాహాలు మొదలుపెట్టాడు. అవి ఒక కొలిక్కి వచ్చాయి. ఎట్టకేలకు సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా కుదిరిందన్నది తాజా సమాచారం. మార్చి 22న పుణ్యక్షేత్రం అయిన హంపిలో ‘జై హనుమాన్’ లాంచ్ ఘనంగా చేయబోతున్నారట. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను కన్నడ స్టార్ రిషబ్ శెట్టి పోషించనున్న సంగతి తెలిసిందే.
హంపి రిషబ్ సొంత రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం. అది తెలుగు వారికి కూడా ప్రత్యేకమే. అలాంటి చోట ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ప్రారంభోత్సవం చేయడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాలని టీం భావిస్తోంది. ‘హనుమాన్’ను ప్రైమ్ షో సంస్థ ప్రొడ్యూస్ చేయగా.. ‘జై హనుమాన్’ మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ చేతికి వచ్చింది. సరిగ్గా తీయాలే కానీ ‘జై హనుమాన్’ వెయ్యి కోట్ల సినిమా అయ్యే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసే ఆలోచనతో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.