'రామాయణం'లో సీత పాత్రకు సాయిపల్లవి ఎంపిక సరైనదే.. ఈ నటి దానికి ప్రూఫ్!
దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న రెండు భాగాల 'రామాయణం'లో సీత పాత్ర కోసం జరిగిన ఆడిషన్స్‌లో తాను సెలెక్ట్ కాలేదని నటి శ్రీనిధి శెట్టి స్వయంగా అంగీకరించారు.
దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న రెండు భాగాల 'రామాయణం'లో సీత పాత్ర కోసం జరిగిన ఆడిషన్స్‌లో తాను సెలెక్ట్ కాలేదని నటి శ్రీనిధి శెట్టి స్వయంగా అంగీకరించారు. ఇది ఈ యువనటి పరిణతికి, నిజాయితీకి అద్దం పడుతోంది. ``రామాయణం ఆఫర్ వచ్చినా కాదనుకున్నానని ప్రచారం సాగుతోంది.. కానీ అంత మంచి ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా? జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.. నేను ఎంపిక కాలేదు`` అని శ్రీనిధి కుండబద్దలు కొట్టారు. కేజీఎఫ్ వంటి భారీ హిట్ సాధించిన నటి అయ్యుండీ.. ఇలాంటి విషయాన్ని నిజాయితీగా అంగీకరించడం సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.
శ్రీనిధి శెట్టి లాంటి అందాల పోటీల రాణిని కూడా ఆడిషన్స్‌లో పక్కనబెట్టిన తర్వాతే నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీ - యశ్ బృందం సాయిపల్లవిని సీత పాత్ర కోసం ఫైనల్ చేశారు. పురాణేతిహాసాల్లోని ఒక పవిత్రమైన పాత్రకు ఎంపిక చేయడం వెనుక చిత్రబృందం ఎంతటి కఠినమైన వడపోత (స్క్రుటినీ) నిర్వహించిందో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఒక నటికి కేవలం బాహ్య సౌందర్యం ఉంటే సరిపోదని.. అభినయం, వాచకం, ముఖకవళికలు వంటి అంశాల్లో ప్రావీణ్యం ఉన్నప్పుడే ఇలాంటి పాత్రలకు ఎంపిక చేస్తారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అయితే సాయిపల్లవి ఎంపికపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు సాయిపల్లవి సీత పాత్రకు సెట్ కాదని వాదిస్తున్నారు. రామాయణ కావ్యంలో సీతాదేవి రూపాన్ని కవులు ఎంతో విలక్షణంగా, దివ్యంగా వర్ణించారని.. ఆ లక్షణాలు సాయిపల్లవిలో లేవంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక నటిగా ఆమె ప్రతిభపై గౌరవం ఉన్నా.. పౌరాణిక పాత్రల ఆహార్యం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
మరో వైపు చిత్రబృందం ఆలోచన మాత్రం వేరేలా ఉంది. వందలాది మందిని ఆడిషన్స్ చేసి.. అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాతే తమకు కావలసిన భావోద్వేగాలు, సహజమైన నటనను పండించగల సామర్థ్యం సాయిపల్లవిలోనే ఉందని భావించి ఎంపిక చేసుకున్నారు. కేవలం మేకప్, ఆభరణాల కంటే సీతాదేవి పాత్రకు అవసరమైన నిష్కల్మషమైన అభినయం, పవిత్రమైన భావాలను తెరపై పండించడంలో సాయిపల్లవి సరైన ఎంపిక అని మేకర్స్ నమ్ముతున్నారు.
ఏది ఏమైనా `రామాయణం`లో ఛాన్స్ మిస్ అయినా శ్రీనిధి శెట్టి తన కెరీర్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ముందుకుసాగుతున్నారు. `కేజీఎఫ్` సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న`ఆదర్శ కుటుంబం` చిత్రంలో ఒక కథానాయికగా నటిస్తున్నారు.