హరీష్‌ శంకర్‌ ఎగ్జామ్‌ డేట్‌ ఫిక్స్‌

Update: 2015-07-02 11:05 GMT
డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. 'షాక్‌' లాంటి డిజాస్టర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు హరీష్‌. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ అతడితో 'మిరపకాయ్‌' సినిమా చేసి సక్సెస్‌ ట్రాక్‌లోకి తెచ్చాడు రవితేజ. దాని తర్వాత అనూహ్యంగా పవన్‌కళ్యాణ్‌తో చేసే ఛాన్స్‌ రావడం.. 'గబ్బర్‌సింగ్‌'తో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ మారిపోవడం చకచకా జరిగిపోయాయి. కానీ 'రామయ్యా వస్తావయ్యా' హరీష్‌ను మళ్లీ ఒకప్పటి స్థితికి తీసుకొచ్చేసింది. రెండేళ్ల పాటు సినిమా లేకుండా ఖాళీగా ఉండిపోయాడు. ముందు సినిమాకు ఓకే అన్న అల్లు అర్జున్‌ వెనకడుగు వేస్తే సాయిధరమ్‌తో సర్దుకుపోవాల్సిన పరిస్థితికి వచ్చాడు.

గతం గత: అనుకుని 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'తో తనేంటో ప్రూవ్‌ చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు హరీష్‌ శంకర్‌. 'రామయ్యా వస్తావయ్యా' లాంటి సినిమా తర్వాత కూడా దిల్‌ రాజు హరీష్‌కు ఇంకో ఛాన్స్‌ ఇచ్చాడంటే స్క్రిప్టులో అంత దమ్ము ఉండే ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో షూటింగ్‌ ఆరంభించి ఫినిషింగ్‌ స్టేజ్‌కు తీసుకొచ్చాడు హరీష్‌. ఈ మధ్యే అమెరికాలో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. ఇంకొంత షూటింగ్‌ చేసి ఈ నెలాఖరుకల్లా ఫస్ట్‌ కాపీ రెడీ చేసేస్తాడట. రిలీజ్‌ డేట్‌ కూడా ఖరారయిపోయింది. ఆగస్టు 28న ఈ సినిమాను ప్రేక్షకుల మందుకు తెస్తారట. హరీష్‌ కెరీర్లో అతి పెద్ద పరీక్ష ఎదుర్కోబోతున్న రోజు ఇదని చెప్పాలి. ఆ పరీక్షలో అతను ఎలాంటి ఫలితం రాబడతాడో చూద్దాం.

Tags:    

Similar News