ఆకాశం నుంచి పాతాళానికి రాజేష్ ఖన్నా రాజసం!
భారతీయ చలనచిత్ర రంగానికి తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన రాజేష్ ఖన్నా కెరీర్ ఆయన ప్రవర్తన గురించి ప్రముఖ సంగీత ద్వయం కళ్యాణ్‌జీ-ఆనంద్ జీలలో ఒకరైన ఆనంద్ జీ విర్జీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం తలకు ఎక్కడం, విపరీతమైన అహంకారం, మోతాదుకు మించిన తాగుడు అలవాటు వల్ల రాజేష్ ఖన్నా నటనతో సాధించిన ప్రతిష్టను స్వయంగా ఎలా దెబ్బతీసుకున్నారో 93 ఏళ్ల ఆనంద్ జీ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
తొలినాళ్లలో రాజేష్ ఖన్నా ఎంతో నమ్రతతో ఉంటూ తానంటే ఎంతో గౌరవం చూపించేవారని ఆనంద్ జీ తెలిపారు. 1966లో `ఆఖ్రీ ఖత్ `తో అరంగేట్రం చేసిన రాజేష్ ఖన్నా రెండో చిత్రం `రాజ్` కోసం కళ్యాణ్‌జీ-ఆనంద్ జీలతో పనిచేశారు. ప్రారంభంలో ఆనంద్ జీని సార్ అని పిలిచే ఆయన సూపర్‌స్టార్‌గా మారిన తర్వాత తన ప్రవర్తనను పూర్తిగా మార్చేసుకున్నారని.. తాను గదిలోకి లేదా షూటింగ్ సెట్‌లోకి రాగానే అందరూ లేచి నిలబడి గౌరవించాలని ఆశించేవారని పేర్కొన్నారు.
ఖన్నాకు తాగుడు తీవ్రమైన వ్యసనంగా మారిందని.. దానితో పాటు సెట్స్‌పై ఆయన పెట్టే నఖ్రాలు పెరిగిపో యాయని ఆనంద్ జీ వెల్లడించారు. `జోరూ కా గులామ్` సినిమా రికార్డింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. పాట రికార్డింగ్ పూర్తయిన తర్వాత సెట్‌కు వెళ్లిన రాజేష్ ఖన్నా ఆ పాటలో నటించనంటూ పెద్ద గొడవ చేశారని తెలిపారు. ఇలాంటి ప్రవర్తన వల్ల రాజేష్ కెరీర్ పతనమవ్వడం ఖాయమని ఆనంద్ జీ ఆనాడే ఊహించారు.
రాజేష్ ఖన్నా వైఖరి చూసి ఆగ్రహించిన ఆనంద్ జీ ముక్కుసూటిగా ఆయన ముఖం మీదే ఈ విషయాన్ని చెప్పేశారట. `నీకు అన్నీ తెలుసనుకుంటున్నావు కానీ నీ సూపర్‌స్టార్ రోజుల గడువు ముగిసింది. మీ రోజులకంటే పరిమితులు ముగిశాయి. మనుషులు నేలపై నిలబడి అందరినీ పని చేసుకోనివ్వాలి గానీ ఇలా వ్యవహరిం చకూడదు` అని ఖన్నాకు ముఖంపైనే స్పష్టం చేసినట్లు ఆనంద్ జీ చెప్పారు.
కెరీర్ పతనమైన తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఆనంద్ జీని కలిసినప్పుడు రాజేష్ ఖన్నా `ఆనంద్ జీ, మీ కోపం తగ్గిందా? అని అడిగారని దానికి స్పందిస్తూ `నాకు కోపం రావడానికి ఏ కారణమైతే ఉందో అది జరిగిపోయింది. ఇక ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు` అని చెప్పినట్లు వెల్లడించారు. అపజయాన్ని తట్టుకోలేక, అమితాబ్ బచ్చన్ ఎదుగుదలను జీర్ణించుకోలేక రాజేష్ ఖన్నా విపరీతంగా తాగుడుకు బానిసయ్యారని పరిశ్రమ వర్గాలు అంటుంటాయి.
మరోవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యవహరించిన తీరును ఆనంద్ జీ ప్రశంసించారు. ఆరంభంలో ఎన్నో పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ అమితాబ్ నిగ్రహంతో, క్రమశిక్షణతో ఉన్నారని తెలిపారు. సూపర్‌స్టార్‌గా మారిన తర్వాత కూడా అమితాబ్ ఎప్పుడూ ఒదిగి ఉండే తత్వాన్ని కోల్పోలేదని.. అదే ఆయన సుదీర్ఘ విజయం వెనుక ఉన్న అసలు రహస్యమని ఆనంద్ జీ అభిప్రాయపడ్డారు.