తెరపైకి ఆ క్రికెట్ లెజెండ్ బయోపిక్

Update: 2018-05-21 17:53 GMT
బాలీవుడ్లో గత కొన్నేళ్లుగా స్పోర్ట్స్ బయోపిక్స్ హవా నడుస్తోంది. ‘బాగ్ మిల్కా బాగ్’ సినిమాతో మొదలైన ఈ ఊపు ‘ఎం.ఎస్.ధోని’తో పతాక స్థాయికి చేరింది. మేరీకోమ్.. సచిన్ టెండూల్కర్ లాంటి క్రీడా దిగ్గజాల జీవిత కథలతో కూడా సినిమాలు వచ్చాయి. వీటిలో చాలావరకు మంచి ఫలితాలే సాధించాయి. ముఖ్యంగా ధోని సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మరో ఆసక్తికర బయోపిక్ కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ సినిమా మరెవరిదో కాదు.. ‘కలకత్తా రాకుమారుడు’గా.. ‘దాదా’గా సుపరిచితుడైన భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీది.

భారత క్రికెట్ చరిత్రలో గంగూలీది ప్రత్యేక అధ్యాయం. ఇండియా నుంచి వచ్చిన అత్యుత్తమ వన్డే ఆటగాళ్లలో ఒకడే కాదు.. గొప్ప కెప్టెన్లలో కూడా గంగూలీ ఒకడు. భారత క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చిన ఘనత అతడిది. దాదా కథతో త్వరలోనే బయోపిక్ రాబోతోంది. కాకపోతే ఇది సినిమాగా తెరకెక్కట్లేదు. దీన్ని వెబ్ సిరీస్ గా రూపొందించబోతున్నారు. ఏక్తా కపూర్ బాలాజీ ఆర్ట్ పిక్చర్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. కోల్ కతాలోని ఓ సంపన్న కుటుంబం నుంచి వచ్చిన గంగూలీ.. భారత క్రికెట్లో చాలా వేగంగా ఎదిగాడు. అదనపు ఆటగాడిగా డ్రింక్స్ తీసుకెళ్లమన్నందుకు నొచ్చుకున్న అతను.. తుది జట్టులో చోటివ్వగానే తన తొలి టెస్టులోనే సెంచరీ బాదాడు. అతడి అంతర్జాతీయ కెరీర్ ఉజ్వలంగా సాగి.. చివర్లో ఒడుదొడుకుల మధ్య ముగిసింది. ఎంతో డ్రామా ఉన్న దాదా ప్రయాణాన్ని తెరపై చూపిస్తే ఆ మజానే వేరు.


Tags:    

Similar News