ఓటీటీల్లో కొన్ని థియేట‌ర్ల‌లో మ‌రికొన్ని రె`ఢీ`

Update: 2021-07-13 17:30 GMT
ఐదారు నెల‌లుగా సినిమాల రిలీజ్ ల‌పై సందిగ్ధ‌త ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు సెకండ్ వేవ్ నుంచి రిలీఫ్ క‌నిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో నిర్మాత‌లు హైరానా ప‌డిపోతున్నారు. రిలీజ్ తేదీల‌ను ఫిక్స్ చేసి థియేట‌ర్ల‌ను రెడీ చేయిస్తున్నారు. ఓటీటీ బాట‌లో కొన్ని రిలీజైపోతుంటే థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం చాలా సినిమాలు రెడీ అవుతుండ‌డం చర్చ‌కు వ‌చ్చింది.

అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కూ ఆగి చూశాకే టాలీవుడ్ నిర్మాత‌లు త‌మ సినిమాలను ఓటీటీల‌కు అమ్ముకోవాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ హెచ్చ‌రించినా డి.సురేష్ బాబు కాంపౌండ్ నుంచి మూడు సినిమాలు ఓటీటీల్లో రిలీజ‌వుతున్నాయ‌న్న వార్త‌ హీట్ పెంచుతోంది. వెంక‌టేష్‌ నార‌ప్ప  ఓటీటీ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. రానా విరాట‌ప‌ర్వం ఓటీటీలోనే వ‌స్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ త‌ర్వాత వెంకీ న‌టించి సీక్వెల్ మూవీ దృశ్యం 2 ఓటీటీ బ‌రిలోనే దిగ‌నుంది.

ఓవైపు మూడు పెద్ద సినిమాలు ఓటీటీల‌కు వెళుతున్నా త‌మ సినిమా ల‌వ్ స్టోరి ని మాత్రం కేవ‌లం థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేసేందుకు దాదాపు ప‌ది పెద్ద‌ డీల్స్ ర‌ద్దు చేసుకున్నామ‌ని సునీల్ నారంగ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నాగచైత‌న్య - సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరి థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

ఇప్ప‌టికే థియేట్రిక‌ల్ రిలీజుల విష‌యంలో ఆగ‌స్ట్ 2021 కేట‌లాగ్ రెడీ అయింద‌ని స‌మాచారం.  స‌త్య‌దేవ్- ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా న‌టించిన‌ `తిమ్మరుసు` అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై 30 న రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా నాయ‌కానాయిక‌ల‌పై తెర‌కెక్కించిన ప్రోమో సాంగ్ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.  

అలాగే ఆగ‌స్టులో రిలీజ్ కి రానున్న‌ మూడు నాలుగు సినిమాల రిలీజ్ తేదీలు రివీల‌య్యాయి. ఇప్ప‌టికే ఎస్.ఆర్ క‌ళ్యాణ మండ‌పం సినిమా ఆగ‌స్ట్ 6న విడుద‌ల అవుతున్న‌ట్లుగా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. కిర‌ణ్‌- ప్రియాంక జ‌వాల్క‌ర్ ఈ చిత్రంల జంట‌గా న‌టించారు. ఇప్ప‌టికే టీజ‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. త‌దుప‌రి ఆగ‌స్ట్ 13న ల‌వ్ స్టోరి రిలీజ్ కి రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత నాని న‌టించిన `ట‌క్ జ‌గ‌దీష్` రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

నితిన్ మ్యాస్ట్రో రిలీజ్ తేదీ వెల్ల‌డించాల్సి ఉంది. ఇక జూలై 16న కుడి ఎడ‌మైతే రిలీజ‌వుతుండ‌గా.. ఫ‌ర్హాన్ అక్త‌ర్ న‌టించిన హిందీ యాక్ష‌న్ చిత్రం తూఫాన్ ప్రైమ్ వీడియోలో అదే రోజు విడుద‌ల‌వుతోంది. జూలై 20న నార‌ప్ప ప్రైమ్ వీడియోలో రిలీజ‌వుతుండ‌గా.. జూలై 22న స‌రప‌ట్టా అనే త‌మిళ చిత్రం ప్రైమ్ లో విడుద‌ల‌వుతోంది. జూలై 23న బాలీవుడ్ చిత్రం హంగామా 2 హాట్ స్టార్ లో విడుద‌ల కానుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన‌ భారీ హిస్టారిక‌ల్ మూవీ భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా హాట్ స్టార్ లో ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది. అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఏజెంట్ డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంద‌ని తెలుస్తోంది.

ఈ ఆగ‌స్టులో అటు త‌మిళం క‌న్న‌డ మ‌ల‌యాళంలోనూ ప‌లు చిత్రాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. ప‌లువురు అగ్ర హీరోలు న‌టించిన సినిమాల్ని రిల‌జ్  చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది. హైద‌రాబాద్ - చెన్న‌య్- బెంగ‌ళూరు - కోల్ క‌త స‌హా అన్ని మెట్రో న‌గ‌రాల్లో ప‌లు భాష‌ల నుంచి క్రేజీ చిత్రాల్ని మ‌ల్టీప్లెక్సుల్లో మునుప‌టిలా య‌థావిధిగా ఆడించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.
Tags:    

Similar News