సీబీఐ ఎంక్వైరీ..దళపతి చుట్టూ ఏం జరుగుతోంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. అంతే కాకుండా రంగులు కూడా మారుతోంది.;
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. అంతే కాకుండా రంగులు కూడా మారుతోంది. ఇప్పటి వరకు అక్కడ రెండే రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది. అయితే ఇప్పుడు విజయ్ ఎంట్రీతో ఆ పోటీ త్రిముఖ వార్‌గా మారి మరింత రసవత్తరంగా మారుతోంది. సినిమాలకు గుడ్‌బై చెబుతూ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తమిళనాట జాతీయ పార్టీలకు పెద్దగా స్కోప్ లేదు.
కాంగ్రెస్ పార్టీకి అసలు అక్కడ సీనే లేదు. ఈ పార్టీకి గత కొన్నేళ్లుగా అక్కడ బలం లేదు. బలమైన లీడరూ లేడు. దీంతో డీఎంకే (ద్రావిడ మున్నెట్ర కజగం), ఏఐఏడీఎంకే (ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్ర కజగం) పార్టీల మధ్యే ఇన్నేళ్లుగా పోటీ ప్రధానంగా సాగుతూ వచ్చింది. విజయ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఈ రెండు పార్టీలని కాదనుకునే వారికి విజయ్ టీవీకే అక్కడ ప్రత్యామ్నయంగా మారబోతోంది. ఇదే ఇప్పుడు తమిళనాట సరికొత్త వివాదాలకు తెర లేపుతోందా?..హీరో విజయ్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టేలా చేస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
దీనికి ప్రత్యక్షంగా కరూర్ తొక్కిసలాట, విజయ్‌పై సీబీఐ ఎంక్వైరీ, `జన నాయగన్` సెన్సార్ వివాదం ఆజ్యం పోస్తున్నాయి. కరూర్ లో విజయ్ రోడ్ షోకు దిగడం అక్కడ ఎవరూ ఊహించని విధంగా తొక్కీసలాట జరగడం..ఆ ప్రమాదంలో సామాన్యులు 41 మంది మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనని సీరియస్‌గా తీసుకున్న సుప్రీం కోర్టు హీరో విజయ్‌పై సీబీఐ ఎంక్వైరీకి అదేశించింది. ఇటీవలే ఒక సారి సీబీఐ ముందు హాజరైన విజయ్ తాజాగా సోమవారం మరోసారి హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనవరి 12న విజయ్‌ని ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆరు గంటలకు పైగా విచారించారు. అనంతరం మరుసటి రోజు విచారణకు రావాలని చెప్పడంతో తాను రాలేనని, పొంగల్ కారణంగా మరో తేదీన వస్తానని సీబీఐని కోరాడట. దానికి అంగీకరించిన సీబీఐ వర్గాలు విజయ్‌ని జనవరి 19న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సూచించారని, దాని ప్రకారమే విజయ్ సోమవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంకు చేరుకున్నారట. అయితే తొలి సారి విచారణకు హాజరైన సందర్భంలో విజయ్ కరూర్ తొక్కిసలాట విషయంలో తన తప్పేమీ లేదని, అదంత అక్కడ శాంతి భద్రతలు నిర్వహిస్తున్న పోలీసులదేనని చెప్పాడట. క్రౌడ్‌ని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని వెల్లడించాడట.
విజయ్ ఏం చెప్పాడో అతని పార్టీ వర్గాలు, డ్రైవర్ కూడా సేమ్ టు సేమ్ సమాధానం చెప్పడంతో రెండవ సారి జరిగే విచారణలో ఈ అంశాలపైనే ప్రధానంగా సీబీఐ వర్గాలు దృష్టి పెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా ఆ రోజు జరిగిన తప్పిదాన్ని స్టాలిన్ ప్రభుత్వ అసమర్థతగా విజయ్ చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో విజయ్ టీవీకేతో పాటు ఏఐఏ డీఎంకెకు ప్లస్‌గా మారుతుందని తమిళనాడు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ విజయ్ సమాధానాలతో సీబీఐ సంతృప్తి చెందక పోతే కరూర్ తొక్కిసలాటకు బాధ్యుడిగా భావిస్తూ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.