శింబూ... డోంట్ కేర్ అంటున్నాడే!

Update: 2017-11-13 07:22 GMT
కెరీర్ ప్రారంభం నుంచి వివాదాల‌తో సావాసం చేస్తున్న త‌మిళ హీరో శింబు మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. రెండేళ్ల కింద‌ట బీప్ సాంగ్‌ తో క‌ల‌క‌లం రేపిన శింబు మ‌రోసారి అలాంటి ప్ర‌యోగంతో సంచ‌ల‌నం స‌ృష్టించాడు. అయితే ఈసారి ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓ పాట పాడేశాడీ యువ హీరో. దీంతో ఈ వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మార‌డ‌మే కాకుండా.. శింబుకు బెదిరింపులు కూడా వ‌స్తున్నాయ‌ట‌. ఫ‌లితంగా చెన్నై టి.న‌గ‌ర్‌ లో శింబు నివాసానికి పోలీసులు ప‌టిష్ట భ‌ద్ర‌త క‌ల్పించారు.

ఇక విష‌య‌మేమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రముఖ గేయ రచయిత కపిలన్‌ రాసిన పాటను శింబు పాడారు. ఈ నెల 8న ‘తట్టురోమ్‌ తూక్కురోమ్‌’(తడదాం-మోద్దాం) పేరుతో ఈ పాట విడుదలై తీవ్ర వివాదానికి దారితీసింది. ఇందులో పెద్దనోట్లు రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. విజయమాల్యా త‌దిత‌ర ఎగవేతదారులు విదేశాలకు తప్పించుకుని పారిపోతున్న విషయాన్నీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంపై ఇరుకున ప‌డేసేలా ఉన్న‌ ఈ పాట ప్రస్తుతం వైర‌ల్‌ గా మారి  చర్చకు తెర‌తీసింది. దీంతో శింబుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేప‌థ్యంలోనే శింబుకు బెదిరింపులు వ‌చ్చాయ‌నే వార్త‌లు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి.

అయితే తనకు ఎవరి నుంచి ఎటువంటి బెదిరింపులు రాలేదని శింబు స్ప‌ష్టంచేశాడు. ఈ విషయంపై ట్విట్టర్‌ లో ఆదివారం వివరణ ఇచ్చాడు. పెద్ద నోట్లు రద్దు - జీఎస్‌ టీ పన్ను విధానం లాంటి విషయాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పాటలో పొందుపరచామని తెలిపాడు. పాట రాసింది తాను కాదని, ఒక గాయకుడిగా తన బాధ్యతను మాత్రమే తాను నిర్వహించానని చెప్పాడు. ఈ విషయమై తనకెలాంటి బెదిరింపులు రాలేదని, ఒక వేళ వచ్చినా భయపడబోనని స్ప‌ష్టంచేశాడు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదని,  తాను పాడిన‌ పాట ఎవరి మనసునైనా గాయపరిస్తే క్షమాపణ చెబుతాన‌ని శింబు చెప్పాడు.
Tags:    

Similar News