నాని 'ప్యారడైజ్'కి రియల్ టెస్ట్.. యష్‌ని ఢీకొట్టాల్సిందే!
నేచురల్ స్టార్ నాని ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అతడు నటిస్తున్న తాజా చిత్రం `ది ప్యారడైజ్` ఆగస్టులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అతడు నటిస్తున్న తాజా చిత్రం `ది ప్యారడైజ్` ఆగస్టులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి నాని బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రత్యర్థితో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ప్యారడైజ్ సినిమాకు ఊహించని రీతిలో ఒక రియల్ టెస్ట్ ఎదురైంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న గ్లోబల్ పాన్-ఇండియా మూవీ `టాక్సిక్` తో నాని నేరుగా తలపడాల్సిన సన్నివేశం ఎదురైంది. టాక్సిక్ ఆగస్టులో బరిలోకి దిగుతుండడంతో.. ట్రేడ్ వర్గాలతో పాటు సినీ లవర్స్‌లోనూ ఈ బాక్సాఫీస్ వార్ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
గతంలో రిలీజ్ చేసిన ఒకే ఒక్క అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది యశ్ `టాక్సిక్`. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `హానర్ థై ఫాదర్` అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలకు సిద్ధమవుతోంది. `టాక్సిక్` ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోందని ప్రకటించగానే ఇటు తెలుగు రిలీజ్‌లపైనా క్యూరియాసిటీ నెలకొంది. టాక్సిక్ విడుదలకు సరిగ్గా ఐదు రోజుల ముందే, అంటే ఆగస్టు 21న నాని `ది ప్యారడైజ్` ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం ఐదు రోజుల గ్యాప్ తో వస్తున్న `టాక్సిక్`తో పోటీపడుతూ బాక్సాఫీస్ వద్ద పోరాడాల్సి ఉంటుంది.
ఆసక్తికరంగా ఈ పోరు కేవలం నాని- యశ్ ల మధ్యే కాదు .. ఇదే కాంపిటీషన్‌లో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరడం ఆసక్తిని కలిగిస్తోంది. శర్వా నటిస్తున్న `భోగి` ఆగస్టు 28న విడుదల కానుంది. ఇది టాక్సిక్ విడుదలైన రెండు రోజులకు పోటీలోకి చేరుతుంది. అలాగే ఇదే నెల 21న `ఇరుముడి` అనే మరో చిత్రం కూడా రేసులోకి దిగుతోంది. ఇలా బ్యాక్-టు-బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఒకే వారంలో థియేటర్లకు క్యూ కడుతుండటంతో ఎవరి బాక్సాఫీస్ బలం ఎంతో నిరూపించుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
థియేటర్ల సర్ధుబాటు ముఖ్యం:
ఇలాంటి భారీ క్లాష్ ఉన్నప్పుడు సినిమాల కంటెంట్‌తో పాటు థియేటర్ల సర్దుబాటు అనేది అత్యంత కీలకమైన అంశంగా మారుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాని, శర్వానంద్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అదే సమయంలో పాన్-ఇండియా రేంజ్‌లో వస్తున్న యశ్ `టాక్సిక్` (తెలుగు డబ్బింగ్) చిత్రానికి కూడా భారీగా థియేటర్లను కేటాయించాల్సి ఉంటుంది. నైజాం, ఆంధ్రా ఏరియాల్లో ఏ సినిమాకు ఎన్ని స్క్రీన్స్ దక్కుతాయి? డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను ఎలా సర్దుబాటు చేస్తారనే దానిపైనే ఆయా చిత్రాల ఓపెనింగ్స్ - కలెక్షన్ల లెక్కలు ఆధారపడి ఉంటాయి.
అయితే ఈ భారీ కాంపిటీషన్‌లో అన్ని సినిమాలకు కలిసొచ్చే అతిపెద్ద సానుకూల అంశం `లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్`. ఓనమ్, రక్షాబంధన్ వంటి పండుగ ల రాకతో ఆగస్టు చివరి వారంలో వరుసగా వచ్చే సెలవులు, వీకెండ్స్ బాక్సాఫీస్ వసూళ్లకు పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి. ఒకవేళ నాని `ది ప్యారడైజ్` చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే.. `టాక్సిక్`, `భోగి` చిత్రాల పోటీ ఉన్నా ఈ లాంగ్ వీకెండ్ సెలవులను ఉపయోగించుకుని సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ హోరాహోరీ బాక్సాఫీస్ పోరులో నేచురల్ స్టార్ నాని, ట్యాలెంటెడ్ శర్వా ఇద్దరూ రాకింగ్ స్టార్ యశ్‌ను ఢీకొట్టి విజేతగా నిలుస్తారో లేదో వేచి చూడాలి!