ఇకపై 'రెడ్ బ్యాగ్' కనిపిస్తే ఈ సినిమానే గుర్తొస్తుందట!

చిన్న సినిమాల నుంచి కొత్త ఆలోచనలు, భిన్నమైన కథలు వస్తున్నాయని తెలుగు ప్రేక్షకులు ఎన్నోసార్లు నిరూపించారు.

Update: 2026-06-21 15:39 GMT

చిన్న సినిమాల నుంచి కొత్త ఆలోచనలు, భిన్నమైన కథలు వస్తున్నాయని తెలుగు ప్రేక్షకులు ఎన్నోసార్లు నిరూపించారు. ఇప్పుడు అలాంటి ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ది రెడ్ బ్యాగ్ ఒకటి. మెమరీ మేకర్స్ బ్యానర్‌ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ఆ సినిమాకు రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. తాజాగా ఆ మూవీ టీజర్‌ ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ రిలీజ్ చేయగా, ఆ ఈవెంట్ లో మూవీ టీమ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సినిమా గురించి మాట్లాడిన దర్శకుడు రవి కుమార్ సీరపు.. ది రెడ్ బ్యాగ్ నార్మల్ థ్రిల్లర్ కాదని, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే కథతో రూపొందిందని తెలిపారు. సాధారణంగా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం మాత్రమే గుర్తుంటుందని, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎప్పుడైనా రెడ్ కలర్ బ్యాగ్ కనిపిస్తే ఆ సినిమానే గుర్తుకు వచ్చేలా కథను తీర్చిదిద్దామని చెప్పారు. సినిమా పేరు వెనుక కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్, ఆసక్తికరమైన కథనం ఉందని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్మాత హరికృష్ణ సోమిశెట్టికి దర్శకుడు ప్రత్యేక థ్యాంక్స్ తెలిపారు. సినీ పరిశ్రమలో అవకాశమే పెద్ద విషయం అని, తనపై నమ్మకం ఉంచి ప్రాజెక్టును అప్పగించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కొత్తవారితో సినిమా చేయడం ఒక సవాలే అయినప్పటికీ, అందరూ కలిసి మంచి ఫలితం కోసం కష్టపడ్డామని చెప్పారు.

నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ.. ది రెడ్ బ్యాగ్ కేవలం ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే కథ కాదని స్పష్టం చేశారు. ఆ బ్యాగ్ వెనుక పెద్ద కథతో పాటు ప్రేక్షకులను కదిలించే సున్నితమైన భావోద్వేగాలు ఉన్నాయని తెలిపారు. సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని, హీరో కబీర్ సింగ్‌తో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.

రచయిత, దర్శకుడు హరిప్రసాద్ జక్కా కూడా మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. నిమాకు అసలైన హీరో నిర్మాత హరికృష్ణ సోమిశెట్టేనని అన్నారు. ఎందుకంటే కొత్తవారితో సినిమా తీస్తూ కూడా ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. సాధారణంగా చిన్న సినిమాలకు ఉండే పరిమితులను దాటి, పెద్ద చిత్రాల రేంజ్ లో నిర్మాణ విలువలు కనిపించేలా ఖర్చు పెట్టారని వెల్లడించారు. దర్శకుడు రవి కుమార్‌ కు మంచి విజన్ ఉందని ప్రశంసించారు.

సీనియర్ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. పోస్టర్లు చూసినప్పుడే మంచి కథతో వస్తోందనే భావన కలిగిందని, టీజర్ చూసిన తర్వాత ఆ నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. సినిమాలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్ లో కూడా మంచి టాలెంట్ కనిపిస్తోందని అన్నారు. ముఖ్యంగా మ్యూజిక్, కెమెరా వర్క్ ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా వచ్చిన టీజర్ కూడా అంచనాలను మరింత పెంచింది. ఒక సాధారణ వస్తువులా కనిపించే రెడ్ బ్యాగ్ వెనుక ఏముంది? ఆ బ్యాగ్ చుట్టూ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? అనే ఆసక్తిని టీజర్ కలిగిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఆ రెడ్ బ్యాగ్‌ లో దాగి ఉన్న కథపైనే ఉంది.

Tags:    

Similar News