'రెడ్ బుక్' లాగే 'రెడ్ బ్యాగ్' హిట్ అవ్వాలి: మంత్రి టీజీ భరత్

సినిమా రంగంలో కొత్త కథలు, కొత్త ఆలోచనలతో వచ్చే సినిమాల్లో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తిని కలిగిస్తున్న చిత్రాల్లో ది రెడ్ బ్యాగ్ కూడా ఒకటి.

Update: 2026-06-21 15:18 GMT

సినిమా రంగంలో కొత్త కథలు, కొత్త ఆలోచనలతో వచ్చే సినిమాల్లో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తిని కలిగిస్తున్న చిత్రాల్లో ది రెడ్ బ్యాగ్ కూడా ఒకటి. మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఆ సినిమాకు రవికుమార్ సీరపు దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆదివారం ఆ సినిమా టీజర్‌ ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత హరికృష్ణపై ప్రశంసలు కురిపిస్తూ, సినిమా ప్రారంభించినప్పుడు పూర్తి చేస్తారా లేదా అనే డౌట్ తనకు వచ్చిందని, కానీ పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు.

కర్నూలుకు చెందిన వ్యక్తి నిర్మాతగా ఎదగడం గర్వకారణమని పేర్కొన్న మంత్రి, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించాలని ఆకాంక్షించారు. రెడ్ బ్యాగ్ అనే టైటిల్ వినగానే తనకు రెడ్ బుక్ గుర్తుకు వచ్చిందని, ఆ పుస్తకం ఎంతగా ప్రజల్లో చర్చనీయాంశమైందో, అదే స్థాయిలో రెడ్ బ్యాగ్ కూడా విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సినిమాలో దాదాపు 40 శాతం షూటింగ్ కర్నూలు ప్రాంతంలో జరిగినప్పటికీ, టీజర్‌లో కనిపించిన విజువల్స్ చూస్తే ఫారిన్ లో చిత్రీకరించినట్లుగా అనిపించిందని భరత్ అన్నారు. ఇది మూవీ టీమ్ టెక్నికల్ వర్క్ కు పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కొనియాడారు. ముఖ్యంగా టీజర్ మిక్సింగ్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయని చెప్పారు. నిర్మాతకు మంచి కమర్షియల్ హిట్ తోపాటు, మొత్తం మూవీ టీమ్ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా చాలామంది నిర్మాతలు లేదా హీరోలు బ్యాగేజ్ తో తమ వారసులను పరిచయం చేయడానికి ముందుకు వస్తారని, కానీ హరికృష్ణ మాత్రం రెడ్ బ్యాగ్ అనే కొత్త ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అన్నారు. చిత్రంలో వైవిధ్యమైన అంశాలు కనిపిస్తున్నాయని, ఆ కొత్తదనమే సినిమాకు విజయాన్ని తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు. నిర్మాతకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షించారు.

దర్శకుడు ఈశ్వర్ మాట్లాడుతూ హరికృష్ణ తనకు పదో తరగతి రోజుల నుంచే పరిచయం అని తెలిపారు. కర్నూలు వ్యక్తిగా ఆయన సినిమా నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. స్టార్ హీరోల మద్దతు లేకుండా, పూర్తిగా కథపై నమ్మకంతో సినిమా చేయడం డేరింగ్ నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నో సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడం హరికృష్ణ ప్రత్యేకత అని కొనియాడారు. టీజర్ విడుదల తర్వాత ది రెడ్ బ్యాగ్ పై హైప్ పెరిగింది కొత్త నటీనటులు, కొత్త కథాంశం, సాంకేతికంగా ఆకట్టుకునే విజువల్స్‌ తో సినిమా ప్రేక్షకులను ఎంత మేర మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. అయితే టీజర్‌ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే, మూవీ టీమ్ విజయంపై నమ్మకంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News