నా కష్టాన్ని ఎవరూ చూడలేదు.. విష్ణు విశాల్ ఎమోషనల్ కామెంట్స్
తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు విశాల్ తాజాగా చేసిన కామెంట్స్ కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు విశాల్ తాజాగా చేసిన కామెంట్స్ కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, వ్యక్తిగత నిరాశలు, అలాగే ఇండస్ట్రీలో తనను ఎలా తీసుకున్నారనే అంశాలపై ఆయన ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా తాను మానసికంగా ఎంతో కష్టమైన దశను ఎదుర్కొన్నానని విష్ణు విశాల్ వెల్లడించారు.
విష్ణు విశాల్ అంటే ఏం చెప్పినా చేస్తాడు, తీసుకున్నా పర్వాలేదు అన్న భావన చాలా మందిలో ఏర్పడిందని, తన కష్టాన్ని, డెడికేషన్‌ను ఎవరూ గుర్తించలేదని, గత మూడేళ్లలో ఈ విషయం తనకు స్పష్టంగా అర్థమైందని, ఆ టైమ్ లో చాలా చీకటి రోజులు చూశానంటూ ఆయన వ్యాఖ్యానించారు. సినిమాల పట్ల తనకున్న నిబద్ధత కారణంగా కొన్ని సందర్భాల్లో ఆర్థిక లాభనష్టాలను కూడా పట్టించుకోలేదని విష్ణు చెప్పారు.
ముఖ్యంగా ఇరండు వానం సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు. సినిమా బాగా రావాలనే ఉద్దేశంతో అదనంగా 80 రోజుల పాటూ షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఆ రోజులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని తెలిపారు. సినిమా బాగా రావాలనేదే తన లక్ష్యమని, అందుకే ఎక్స్‌ట్రా కాల్షీట్స్ కు డబ్బు గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు.
అయితే తన మంచితనాన్ని కొందరు అవకాశంగా తీసుకున్నారని విష్ణు విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా కారణంగా తాను దాదాపు రూ.30 కోట్ల మేర నష్టపోయానని, ఆ విషయాన్ని డైరెక్టర్ కు కూడా వివరించానని, కానీ తన మాటలకు ఆ డైరెక్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని వెల్లడించారు. అంతేకాకుండా, ఒక దశలో తనను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఇన్‌డైరెక్ట్ గా ఆరోపించారు. విష్ణు ఏం చెప్పినా చేస్తాడనే భావనలోకి వెళ్లిపోయారని, అదే తనకు పెద్ద షాక్ ఇచ్చిందని, దాంతో ఇక చాలు అని డిసైడ్ అయ్యానని విష్ణు వ్యాఖ్యానించారు.
విష్ణు విశాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఎక్కడా ఏ డైరెక్టర్ పేరు ప్రస్తావించకపోవడంతో, ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే అంశంపై అభిమానులు, సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, విష్ణు విశాల్ వ్యక్తం చేసిన ఎమోషన్స్ మాత్రం ఇండస్ట్రీలో కళాకారులు ఎదుర్కొనే కనిపించని ఒత్తిళ్లు, త్యాగాలపై మరోసారి చర్చకు దారితీశాయి.