టాలీవుడ్ సింగర్స్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. గ్లోబల్ రేంజ్‌కు దూసుకెళ్లే గోల్డెన్ ఛాన్స్!

ప్రస్తుతం టాలీవుడ్ పరిధి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్‌కు శరవేగంగా విస్తరిస్తోంది. తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు ఇప్పటికే ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతూ ఆస్కార్ వంటి వేదికలపై మెరుస్తున్నారు.

Update: 2026-06-21 15:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ పరిధి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్‌కు శరవేగంగా విస్తరిస్తోంది. తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు ఇప్పటికే ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతూ ఆస్కార్ వంటి వేదికలపై మెరుస్తున్నారు. భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్‌లో దూసుకుపోయే వ్యూహాలను అనుసరిస్తూ.. అందుకు అవసరమైన అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. దీనిని సంగీతం అనే కోణంలో విశ్లేషిస్తే.. తెలుసుకోవాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయి..

ముఖ్యంగా ఇటీవలి కాలంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ మునుముందు సుస్వ‌రాల‌ సంగీత ప్రపంచంలో ఎన్నో సంచలనాలను పరిచయం చేయబోతోంది. ఇలాంటి సాంకేతిక విప్లవ సమయంలో మన టాలీవుడ్ గాయకులు, యువ సంగీత దర్శకులు కూడా అంతర్జాతీయ వేదికపై ఒక టేలర్ స్విఫ్ట్, బియాన్స్, జెన్నిఫర్ లోపేజ్, జస్టిన్ బీబర్, ఎడ్ షీరన్ లేదా బిటిఎస్ `జంగ్ కుక్` రేంజ్‌లో గ్లోబల్ ఐకాన్స్‌గా ఎదిగి గ్లోబ‌ల్ క‌ళాకారుడిగా భారీ ఆర్జనకు తెర తీయాలంటే ఏం చేయాలనే ఆసక్తికర చర్చ ఇప్పుడు మొదలైంది.

మనదేశంలో ఎక్కడో మారుమూల పల్లెల నుంచి వచ్చిన ప్రతిభావంతులు కూడా ఈరోజు టాలీవుడ్‌లో గాయకులుగానో, సంగీత దర్శకులుగానో రాణిస్తున్నారు. అయితే, ప్రాంతీయ స్థాయి నుంచి గ్లోబల్ వేదికకు దూసుకెళ్లడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. దీనికి కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు.. సరైన పబ్లిసిటీ, అంతర్జాతీయ సెలబ్రిటీలతో పరిచయాలు, గ్లోబల్ అల‌యెన్సెస్ (కూటములు) ఎంతగానో తోడ్పడతాయి. అందరికీ ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఏ.ఆర్. రెహమాన్, దేవీశ్రీప్రసాద్, ఎస్.ఎస్. థమన్ తరహాలో విదేశాలలో భారీ లైవ్ కాన్సెర్టులు నిర్వహించి ఆర్జించడం వెంటనే కుదరకపోవచ్చు. కానీ నేటితరం గాయనీగాయకులు, ఔత్సాహిక సంగీత దర్శకులు ప్రపంచ స్థాయికి చేరేందుకు సాంకేతికత ఎన్నో కొత్త ద్వారాలను తెరుస్తోంది. ఈ క్రమంలో గ్లోబల్ రేంజ్‌కు వెళ్లేముందు, మొదట జాతీయ స్థాయిలో తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఉన్న వేదికలను అన్వేషించాల్సి ఉంటుంది.

అలాంటి ఒక అద్భుతమైన జాతీయ వేదిక గురించిన సమాచారాన్ని ప్రపంచ సంగీత దినోత్సవం (వరల్డ్ మ్యూజిక్ డే) సందర్భంగా గ్రామీ అవార్డ్ విజేత, ప్రముఖ సంగీత విద్వాంసుడు శంకర్ మహదేవన్ బ‌య‌టి ప్ర‌పంచానికి విశ‌ద‌ప‌రిచారు. ఇండిపెండెంట్ (స్వతంత్ర) సంగీతానికి ఎంతో భ‌విష్య‌త్ ఉంద‌ని చెబుతున్న ఆయ‌న‌.. దీనికి ఉన్న‌ భారీ మైలేజ్, ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. పరిశ్రమలోనే మొదటిసారిగా ఆర్టిస్టుల ఆధ్వర్యంలో నడిచే `గున్‌గునాల్లో` (Goongoonalo) అనే సరికొత్త మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చారు.

భార‌త‌దేశంలో యువ ప్ర‌తిభావంతుల‌ను దేశీయంగా, అలాగే అంత‌ర్జాతీయంగా పాపుల‌ర్ చేయ‌డానికి ఇది ఒక వేదిక‌గా మార‌నుంది. దీనిలో శంక‌ర్ మహదేవన్-ఎహసాన్-లాయ్‌లతో పాటు అరిజిత్ సింగ్, సోను నిగమ్, శ్రేయా ఘోషల్, ప్రసూన్ జోషి, జావేద్ అక్తర్ వంటి దేశీ దిగ్గ‌జ సంగీత‌జ్ఞులంతా ప్ర‌తిభావంతుల‌కు స‌హ‌క‌రించేందుకు అందుబాటులో ఉంటారు. వారంతా త‌మ సొంత నిధుల్ని ఖ‌ర్చు చేస్తూ ట్యాలెంట్ ని వెలికి తీసేందుకు పాటుప‌డుతున్నారు.

అయితే, శంకర్ మహదేవన్ లేదా జావేద్ అక్తర్ లాంటి బాలీవుడ్ దిగ్గజాల మనసులను గెలుచుకునేంత ప్రతిభ మన టాలీవుడ్ యువ కళాకారులలో ఉందా అంటే.. క‌చ్చితంగా ఉంది! కాకపోతే ఎందరో యువ గాయకులు లేదా సంగీత క‌ళాకారులు అసలు అలాంటి ప్రయత్నమే చేయరు లేదా ఆ దిశగా ఆలోచించరు. సంగీత రంగంలో అవకాశాల కోసం గ్లోబల్ ట్రెండ్స్ - ఇలాంటి నూతన వేదికలపై కనీస అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. అవగాహన ఉన్నంత మాత్రాన సరిపోదు.. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. మన జీవితంలో గొప్ప గొప్ప వ్యక్తులను, దిగ్గజాలను కలిసినప్పుడు ఎలాంటి ఊహించని మలుపులు వస్తాయో చెప్పలేం. కాబట్టి ప్రాంతీయ స్థాయికే పరిమితం కాకుండా స్థానిక గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్లు జాతీయ, అంతర్జాతీయ వేదికలను చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.

సంగీతం అనేది కేవలం డబ్బు సంపాదించుకునే మార్గం మాత్రమే కాదు.. అది ఆత్మను తాకే ఒక పరమ పవిత్రమైన కళతో ముడిపడి ఉన్నది. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో ఆ కళాత్మకతను కోల్పోకుండానే, గ్లోబల్ టెక్నాలజీని వాడుకుంటూ తమ సంపాదన మార్గాలను మెరుగుపరుచుకోవడం నేటి తరం కళాకారులకు ఎంతో అవసరం. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ `గున్‌గునాల్లో` వంటి సరికొత్త వేదికలను ఉపయోగించుకుంటే టాలీవుడ్ యువ సింగర్స్ - మ్యూజిక్ డైరెక్టర్లు ప్రపంచ వేదికపై సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సరికొత్త ఆశలతో, గ్లోబల్ వేదికల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ మన టాలీవుడ్ యువ ప్రతిభకు ఆల్ ది బెస్ట్!

Tags:    

Similar News