• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఇట్లు అర్జున' మూవీ...

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

By - Tupaki Desk
Update: 2026-11-12 20:30 GMT

‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ

నటీనటులు: అనీష్- అనస్వర రాజన్- ముఖేష్ రుషి- కళైఅరసన్- వెన్నెల కిషోర్- బ్రహ్మాజీ- ఎలాంగో కుమార్ వేల్- గెటప్ శ్రీను- రఘుబాబు తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: రాజా మహదేవన్

నిర్మాత: వెంకీ కుడుముల

రచన-దర్శకత్వం: మహేష్ ఉప్పాల

షిరిడి సాయి.. ఓం నమో వేంకటేశాయ చిత్రాలను నిర్మించిన మహేష్ రెడ్డి తన కొడుకు అనీష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా.. ఇట్లు అర్జున. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల మొత్తం ప్రొడక్షన్ చూసుకున్న ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పాల రూపొందించాడు. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. సినిమాగా ఎంతమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.

కథ:

అర్జున్ (అనీష్) ఒక మూగ కుర్రాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి కూడా అనారోగ్యం పాలై ఆసుపత్రికి పరిమితం కావడంతో అతను దొంగగా మారాల్సి వస్తుంది. తండ్రి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసే అతను.. తన ఫ్లాట్ పైన ఉండే కీర్తి (అనస్వర రాజన్)తో చిన్నతనంలోనే ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆమె మనసు గెలవాలని ప్రయత్నిస్తున్న అర్జున్.. అనుకోకుండా పెద్దన్న (ముఖేష్ రుషి) అనే ఒక పెద్ద గూండాకు చెందిన వెయ్యి కోట్ల హవాలా డబ్బుకు సంబంధించిన పాస్ వర్డ్ ను చేజిక్కించుకోవడంతో అతడి వెనుక పెద్ద గ్యాంగులు పడడం మొదలుపెడతాయి. మరి ఈ గ్యాంగుల నుంచి అర్జున్ తప్పించుకోగలిగాడా.. ఈ వెయ్యి కోట్ల వ్యవహారం ఏంటి.. కీర్తితో అర్జున్ ప్రేమ సంగతి ఏమైంది.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

నాగార్జున.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రెటీలను తీసుకొచ్చి ప్రమోట్ చేయించినంత మాత్రాన జనం ఒక కొత్త కుర్రాడి సినిమాను ఎగబడి చూసేస్తారనే గ్యారెంటీ ఏమీ లేదు. ఎంత ఖర్చు పెట్టినా.. ఎంత ప్రమోట్ చేసినా.. అంతిమంగా సినిమాలో విషయం ఉందా లేదా అన్నదాన్ని బట్టే సినిమాకు ఆదరణ దక్కుతుంది. కంటెంటే లేకపోతే ఇంత ఖర్చు, అంతమంది ఎఫర్ట్ వృథానే. ఐతే ఛలో.. భీష్మ లాంటి సాలిడ్ ఎంటర్టైనర్లు తీసిన వెంకీ కుడుముల పర్యవేక్షణలో కొత్త దర్శకుడు మహేష్ ఉప్పాల.. మంచి కమర్షియల్ దినుసులున్న ఎంటర్టైనర్ తో కొత్త హీరో అనీష్ ను విజయవంతంగా అరంగేట్రం చేయించాడు. ఇది మరీ కొత్త కథ కాకపోయినా.. ఎన్నోసార్లు చూసిన క్రైమ్-లవ్ సెటప్ తో రూపొందిన స్టోరీనే అయినా.. ప్రెజెంటేషన్లో కొంత వైవిధ్యం.. ఎంటర్టైనింగ్ గా సాగే కథనంతో ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు బాగానే కూర్చోబెట్టగలిగాడు దర్శకుడు. కొత్త హీరోకు మరీ ఎక్కువ బిల్డప్పులివ్వకుండా.. కథలో అతణ్నొక పాత్రలా మార్చి సింపుల్ గా మార్చి ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేయడం ‘ఇట్లు అర్జున’కు పెద్ద ఎసెట్. మొత్తంగా ఒక కొత్త హీరో నుంచి ఆశించే డీసెంట్ ఎంటర్టైన్మెంట్ తో ‘ఇట్లు అర్జున’ మంచి మార్కులే వేయించుకుంది.

కొత్త హీరోను పరిచయం చేసేటపుడు అతడి టాలెంట్స్ అన్నీ చూపించేయాలని.. చాలా ఎనర్జిటిగ్గా క్యారెక్టర్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటారు ఫిలిం మేకర్స్. పరిచయం దగ్గర్నుంచి విపరీతమైన బిల్డప్ తో పాత్రను నడిపిస్తుంటారు. పంచ్ డైలాగులైతే సరేసరి. హీరో డ్యాన్సింగ్ టాలెంట్ చూపించడానికి ప్రత్యేకమైన పాటలు.. తన ఫైటింగ్ ప్రతిభ చూపించడానికి భారీ యాక్షన్ సీక్వెన్సులు.. ఇలాంటి వ్యవహారాలూ కామనే. కానీ ‘ఇట్లు అర్జున’ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. ఇందులో హీరోను మూగవాడిగా చూపించడంతోనే ఆ పాత్రకు హద్దులు గీసేశారు. పైన చెప్పుకున్న టెంప్లేట్ వ్యవహారాలకు ఇక్కడ స్కోప్ లేకపోయింది. అలా అని మూగవాడనగానే జాలి కలిగేలా మరీ ఎక్కువ సెంటిమెంటు కూడా దట్టించేయలేదు. కొంచెం జాలీ టైపుగానే ఆ పాత్రను తీర్చిదిద్దారు. అరంగేట్ర హీరోను ఇలా చూడడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించి.. ఆ పాత్రతో ట్రావెల్ చేయడానికి అవకాశం లభించింది. అదే సినిమాకు ఎసెట్ అయింది. ఇక హీరో ఇష్టపడే అమ్మాయితో పరిచయం.. ప్రేమ.. తనతో జర్నీ.. ఇలా రొటీన్ సెటప్ లోనే వినోదాత్మక సన్నివేశాలతో టైంపాస్ చేయిస్తూ.. ఇంకోవైపు వెయ్యి కోట్ల హవాలా డబ్బు చుట్టూ నడిపిన క్రైమ్ డ్రామాను సమాంతరంగా నడిపిస్తూ.. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది ‘ఇట్లు అర్జున’. మరీ పేలిపోయే సీన్లు లేకపోయినా.. వాట్ నెక్స్ట్ అనిపించే సన్నివేశాలతో సినిమాను ముందుకు నడిపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు.

‘ఇట్లు అర్జున’లో హీరో కంటే విలన్ల ట్రాకే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వెయ్యి కోట్ల హవాలా డబ్బుకు సంబంధించి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడే గ్యాంగుల మధ్య ఇంట్రెస్టింగ్ క్యాట్ అండ్ మౌస్ సెటప్ క్రియేట్ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం లేనట్లు సాగే హీరో హీరోయిన్ల ట్రాక్ జస్ట్ టైంపాస్ వ్యవహారంలా ఉంటుంది. కానీ హీరో హీరోయిన్లు కూడా ఈ క్రైమ్ వ్యవహారంలో భాగం అయ్యాక కథ రసకందాయంలో పడుతుంది. ఈ రెండు ట్రాక్స్ మిక్స్ అయ్యే ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఐతే విరామానంతరం ఈ టెంపోను కంటిన్యూ చేయడంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు. బాగా టెన్షన్ బిల్డ్ చేయడానికి అవకాశం లభించినా.. దాన్ని ఉపయోగించుకోలేదు. మరోవైపు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ బంధాన్ని ఎమోషనల్ గా మార్చే సరైన సన్నివేశాలు పడలేదు. ఐతే చివరి 40 నిమిషాల్లో మాత్రం ‘ఇట్లు అర్జున’ మళ్లీ ట్రాక్ ఎక్కుతుంది. పద్మవ్యూహం లాంటి విలన్ అడ్డాలోకి హీరో ప్రవేశించి హీరో తన మిషన్ పూర్తి చేసే ఎపిసోడ్ సినిమాలో మేజర్ హైలైట్. తమన్ రణవిహార పాటకు తోడు అదిరిపోయే బీజీఎంతో ఈ సన్నివేశాలను వేరే లెవెల్లో తీసుకెళ్లి పెట్టేశాడు. మాంచి ఎమోషనల్ హై ఇచ్చే పతాక సన్నివేశాలు.. అంతకుముందు తలెత్తిన లోపాలను కూడా కవర్ చేసేస్తాయి. వెయ్యి కోట్ల డబ్బుకు సంబంధించి సరైన పేఆఫ్ ఇవ్వకపోవడం మైనస్సే అయినా.. ముగింపు ఘట్టం మాత్రం ‘ఇట్లు అర్జున’ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కొత్త హీరో పాత్రతో పాటు పెర్ఫామెన్స్ కూడా క్లిక్ అయిన సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ సెటప్.. తమన్ మ్యూజిక్ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి.

నటీనటులు:

కొత్త కుర్రాడు అనీష్ చూడ్డానికి ఓకే అనిపిస్తాడు. యాక్టింగ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రాలేదు కాబట్టి.. తనపై మరీ ఎక్కువ అంచనాలుండవు. అయినప్పటికీ డ్యాన్సులు-ఫైట్ల విషయంలో బాగానే కష్టపడ్డ విషయం తెరపై కనిపిస్తుంది. ఈ రెంటి విషయంలో ఈజ్ చూపించాడు. పాత్రకు తగ్గట్లుగా నటించాడు. మూగవాడి పాత్ర కావడంతో దానికి అవసరమైన అమాయకత్వాన్ని హావభావాల్లో చూపించగలిగాడు. కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. ఓవరాల్ గా అనీష్ పెర్ఫామెన్స్ డీసెంట్ అనిపిస్తుంది. అనస్వర రాజన్ కీర్తి పాత్రలో చలాకీగా నటించి మెప్పించింది. మలయాళంలో చేసిన సినిమాలతో పోల్చుకుని ఆమె నుంచి ఎక్కువ పెర్ఫామెన్స్ ఆశిస్తే కష్టం కానీ.. తెలుగు సినిమా మార్కు హీరోయిన్ పాత్రలో ఆమె సులువుగానే ఒదిగిపోయింది. విలన్ పాత్రల్లో ముఖేష్ రుషి.. కళైఅరసన్.. ఎలాంగో కుమార్ వేల్.. ముగ్గురూ ఆకట్టుకున్నారు. కామెడీ పాత్రల్లో వెన్నెల కిషోర్.. బ్రహ్మాజీ ఒక మోస్తరుగా నవ్వించారు. గెటప్ శ్రీను.. మైమ్ గోపి.. రఘుబాబు పాత్రల పరిధి తక్కువే.

సాంకేతిక వర్గం:

‘ఇట్లు అర్జున’ టెక్నికల్ గా బెటర్ మూవీనే. ఇటీవల ‘ఆదర్శ కుటుంబం’తో నిరాశపరిచిన సంగీత దర్శకుడు తమన్.. కొత్త హీరో కోసం మంచి ఎఫర్టే పెట్టాడు. ఇటు పాటలు.. అటు నేపథ్య సంగీతం విషయంలో అతను ఆకట్టుకున్నాడు. చిన్ని చిన్ని.. రణవిహార.. హాయ్ రే.. పాటలూ మూడూ ప్రేక్షకుల్లో హుషారు తెప్పిస్తాయి. బీజీఎం కూడా ఎనర్జిటిగ్గా సాగింది. చివరి అరగంటలో అయితే తమన్ చెలరేగిపోయాడు. రాజా మహదేవన్ ఛాయాగ్రహణం కూడా రిచ్ గా సాగింది. విజువల్స్ ఆద్యంతం కలర్ ఫుల్ గా సాగాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగేలా మంచి క్వాలిటీ చూపించారు. రచయిత-దర్శకుడు మహేష్ కంబాల.. ఒక హీరో అరంగేట్రానికి అవసరమైన కమర్షియల్ మసాలాలన్నీ దట్టించి సినిమా తీశాడు. తన టేకింగ్ బాగుంది. మహేష్ యాక్షన్ ఘట్టాలను.. కొన్ని ఎలివేషన్ సీన్లను డీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఐతే దర్శకుడు కథ మీద చాలా కసరత్తే చేశాడు కానీ.. కథనంలో లూజ్ ఎండ్స్ లేకుండా మరింత పకడ్బందీగా ఉండేలా చూసుకోవాల్సింది. ఓవరాల్ గా తన పనితనం మెప్పిస్తుంది.

చివరగా: ఇట్లు అర్జున.. అరంగేట్రం బావుందయ్యా

రేటింగ్ - 3/5


Tags:    
  • itlluarjuna 
  • itlluarjunamoviereview 
  • itlluarjunamovie 
  • itlluarjunarating 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

Copyright @2026

Powered by Blink CMS