ఆ హీరో పోలీసుల ముందు లొంగిపోయాడు

Update: 2016-02-22 10:12 GMT
తమిళ స్టార్ హీరో శిలంబరసన్ అలియా శింబు ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. మూడు నెలలుగా తమిళనాడును కుదిపేస్తున్న ‘బీప్ సాంగ్’ వివాదంలో అతను సోమవారం పోలీసుల ముందు హాజరయ్యాడు. ఈ కేసు విషయంలో శింబు దాదాపు రెండు నెలల పాటు అజ్నాతంలో ఉన్నాడు. ఈ మధ్యే బయటికి వచ్చాడు. కాగా.. ఈ నెల 24వ తేదీలోపు కోయంబత్తూర్‌ కోర్టులో హాజరు కావాలని మద్రాసు హైకోర్టు శింబుకు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో అతను తన తండ్రి టి.రాజేందర్‌ తో కలిసి కోయంబత్తూరు పోలీసుల ఎదుట హాజరయ్యాడు. శింబు పోలీస్ స్టేషన్ కు వస్తున్నాడని తెలిసి అక్కడ అతడి అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. శింబుకు అనుకూలంగా నినాదాలు చేశారు.

శింబు వచ్చే సమయానికి అక్కడ చాలా హడావుడి కనిపించింది. మీడియా ప్రతినిధులు అతణ్ని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. తానేమీ తప్పు చేయలేదని.. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసుల ఎదుట హాజరయ్యానని.. ఇక భారమంతా దేవుడి మీదే వేశానని శింబు అన్నాడు. శింబు అమ్మాయిల్ని తిట్టిపోస్తూ సరదాగా రాసుకున్నట్లుగా చెబుతున్న ‘బీప్ సాంగ్’ అనుకోకుండా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. అందులో అమ్మాయిల గురించి దారుణమైన మాటలు ఉండటంతో వివాదం చెలరేగింది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. శింబుతో పాటు అతడి మీద కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఐతే అనిరుధ్ ఇప్పటికే పోలీసుల ముందు హాజరై తన వాదన వినిపించాడు. ఇప్పుడు శింబు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఇంతకీ ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో చూడాలి.
Tags:    

Similar News