హీరోలకు దీటైన పవర్‌ఫుల్ విలన్స్ !
ఇప్పుడు అదే బాటలో చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో హీరోలకు దీటైన మైండ్ గేమ్స్ ఆడే విలన్లను రంగంలోకి దించుతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో విలన్ పాత్రల రూపురేఖలు ..క్యారెక్టరైజేషన్లు పూర్తిగా మారిపోతున్నాయి. కథలో ప్రతి నాయకుడు ఎంత బుద్ధిబలంతో శారీరక శక్తితో బలంగా ఉంటే ఆ విలన్‌ను ఎదిరించే కథానాయకుడి పాత్ర అంతకంటే పవర్‌ఫుల్‌గా ఎలివేట్ అవుతుందనే ఫార్ములాను ఇండస్ట్రీ ఇప్పుడు గట్టిగా నమ్ముతోంది. దర్శకుడు రాజమౌళి తన చిత్రాల్లో విలన్ పాత్రను అసాధారణమైన పవర్‌తో డిజైన్ చేసి, హీరో ఇమేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే ట్రెండ్‌ను సెట్ చేసారు. ఇప్పుడు అదే బాటలో చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో హీరోలకు దీటైన మైండ్ గేమ్స్ ఆడే విలన్లను రంగంలోకి దించుతున్నారు.
నేచురల్ స్టార్ నాని -మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా `ది పారడైస్` లో ఇలాంటి ఓ సరికొత్త పవర్‌ఫుల్ విలనిజం కనిపించబోతోంది. ఈ సినిమాలో నాని సహజసిద్ధమైన నటనకు పక్కా కౌంటర్ ఇచ్చేలా బాలీవుడ్ నటుడు రాఘవ్ జువెల్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోషిస్తున్న విక్రం మాలిక్ అనే క్యారెక్టర్ టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్రూరమైన స్టైలిష్ విలన్ రోల్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. నాని లాంటి పవర్‌హౌస్ పెర్ఫార్మర్‌కు స్క్రీన్ మీద గట్టి పోటీ ఇచ్చేలా శ్రీకాంత్ ఓదెల ఈ పాత్రను ఎంతో ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
విలన్ పాత్రల్లో సరికొత్త విశ్వరూపం చూపించడానికి మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సిద్ధమ వుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `సలార్ 2` లో పృథ్వీరాజ్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. మొదటి భాగంలో ప్రభాస్‌కు ప్రాణస్నేహితుడిగా కనిపించిన పృథ్వీ రెండో భాగంలో పవర్‌ఫుల్ శత్రువుగా మారి ప్రతినాయక ఛాయలను ప్రదర్శించబోతున్నారు. ఇద్దరు సమానమైన కటౌట్ల మధ్య సాగే పగ, ఈగో వార్ బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్‌కు వేదిక కానుంది.
టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న `వారణాసి`లో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి మార్క్ అడ్వెంచర్ కథాంశంలో మహేష్ ను ఢీకొట్టే అంతర్జాతీయ స్థాయి ప్రతినాయకుడిగా ఆయన పాత్ర ఉండబోతోంది. తన అద్భుతమైన వాయిస్ బేస్, ఇంటెన్స్ నటనతో మహేష్ అడ్వెంచరస్ జర్నీకి ఊహించని అడ్డంకులు సృష్టించే మైటీ విలన్ క్యారెక్టర్ ఇది. రాజమౌళి స్ట్రాంగ్ విలన్ రూల్‌ను ఇందులో పీక్స్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
అలాగే ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ విలనిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్ `కల్కి 2898 ఏడీ` మొదటి భాగంలో సుప్రీమ్ యాస్కిన్‌గా ఆయన కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించినా? సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. `కల్కి 2` లో ఆయన విలనిజం పూర్తిస్థాయిలో తెరపై ఆవిష్కృతమవుతుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వంటి మహా వీరులను ఎదిరించే అమరత్వం ఉన్న అత్యంత క్రూరమైన, వైజ్ఞానిక డిక్టేటర్ శక్తిగా కమల్ హాసన్ పాత్ర సైన్స్ ఫిక్షన్ ఎపిక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఆ విధంగా టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో హీరోల ఎలివేషన్లకే పరిమితం కాకుండా.. కథను నడిపించే విలన్ పాత్రల కోసం దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజ నటులను ఎంచుకోవడం అద్భుతమైన పరిణామం. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ తారలు తెలుగు తెరపై ప్రతినాయకులుగా మెరుస్తుండటంతో తెలుగు సినిమాల పరిధి పాన్-ఇండియా దాటి గ్లోబల్ స్థాయికి విస్తరిస్తోంది. హీరో ఇమేజ్‌ను థియేటర్లలో నిలబెట్టేది విలన్ పవరే అనే సత్యాన్ని నేటి టాలీవుడ్ దర్శకులు పక్కాగా అమలు పరుస్తున్నారు.