అక్కడ సీనియర్ హీరో.. ఇక్కడ సీనియర్ దర్శకుడు..!
కాలం మారుతున్న కొద్దీ సమాజంలో మనుషుల ఆలోచనలు, విలువలు, సినిమా ఇండస్ట్రీలోని సెన్సిబిలిటీస్ కూడా ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి.
కాలం మారుతున్న కొద్దీ సమాజంలో మనుషుల ఆలోచనలు, విలువలు, సినిమా ఇండస్ట్రీలోని సెన్సిబిలిటీస్ కూడా ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. 1980లలో నాటి చలనచిత్ర పరిశ్రమ వాతావరణం, పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉండేవి. అప్పట్లో సెట్స్‌పై ఉండే భద్రత, పరస్పర గౌరవాలు, స్నేహాలు, మర్యాదలు వేరే పంథాలో సాగాయి. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో సరికొత్త ధోరణులు రాగా, నేటి 2026 నాటి పరిస్థితులు, నిబంధనలు పూర్తిగా వేరు. ముఖ్యంగా 80ల కాలంలో ఇప్పటిలాగా ఆర్టిస్టులకు సెట్స్‌పై అన్ని రకాల విలాసవంతమైన వసతులు ఉండేవి కావు. పైగా కొత్తగా వచ్చే నటీనటులకు ఇండస్ట్రీ పెద్దల విషయంలో ఉండే మొహమాటాలు, భయాలు కూడా వేరే స్థాయిలో ఉండేవి.
ఇదే విషయాన్ని గతంలో ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో నటి మాధురి దీక్షిత్ సైతం స్వయంగా గుర్తుచేసుకున్నారు. `దయావాన్` సినిమా సెట్‌లో సీనియర్ హీరో వినోద్ ఖన్నా తనను డీప్ కిస్ చేసినప్పుడు, ఆ సమయంలో ఉన్న మొహమాటాల వల్ల, కొత్త నటిని కావడం వల్ల తాను కాదనలేకపోయానని అంగీకరించారు. అయితే దశాబ్దాల క్రితం నాటి కాలమాన పరిస్థితుల్లో జరిగిన ఆ విషయాన్ని ఇప్పుడు జర్నలిస్టు పదే పదే కెలుకుతూ.. సదరు హీరో తప్పుగా ప్రవర్తించాడంటూ నేటి ప్రమాణాలతో తీర్పులు చెప్పడం ఎంతవరకు న్యాయం? ప్రస్తుతం బతికి లేని, తన వివరణ ఇచ్చుకోలేని చనిపోయిన నటుల విషయంలో ఇలాంటి పాత తవ్వకాలు చేయడం అనేది కేవలం సిగ్గులేని సంచలన జర్నలిజం గానే పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే తరహా ముద్దు సీన్ లేదా ప్రవర్తన ఈ రోజుల్లో ఏ హీరో అయినా చేసి ఉంటే.. నిమిషాల్లో `మీటూ` ఉద్యమం, కాస్టింగ్ కౌచ్ అంటూ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం ఖాయమే అయినా జమానా కాలంలో హీరోలోని లోపాన్ని ఇప్పుడు హైలైట్ చేయడం తుచ్చమైనది.
ఇలాంటి పరిణామాలు కేవలం అక్కడ బాలీవుడ్ సీనియర్ హీరో విషయంలోనే కాదు...ఇక్కడ మన టాలీవుడ్ సీనియర్ దర్శకుల విషయంలోనూ కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో అంటే 80ల కాలంలో సీనియర్ దర్శకులు, నిర్మాతలు హీరోయిన్ల తో చొరవగా, సరదాగా మాట్లాడేస్తుంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే పరిస్థితులు లేవు. కానీ, దశాబ్దాల కిందటి ఆ పాత అలవాటును లేదా పద్ధతిని ఇప్పుడు కూడా కొనసాగించాలనుకున్న ఒక ప్రముఖ తెలుగు సీనియర్ దర్శకుడిపై ఇటీవలి కాలంలో చాలామంది సీరియస్ అయ్యారు. నేటితరం కథానాయికలపై అప్పటి తరం హీరోయిన్లలాగా చెయ్యేస్తానంటే కుదరదు దర్శకుడా! అంటూ సోషల్ మీడియా, వెబ్‌మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడటం, ఆ విషయాన్ని తీవ్రంగా సెన్సేషనలైజ్ చేయడం మనం చూస్తున్నాం.
నిజానికి సదరు సీనియర్ దర్శకుడికి ఎలాంటి చెడు ఉద్దేశం లేకపోవచ్చు. అంతమంది పబ్లిక్ లో, అందరి కళ్ల ముందే ఆయన కుమార్తె వయసున్న నేటితరం హీరోయిన్లను ఆప్యాయంగా తాకడం అనేది ఒక పెద్దమనిషిగా, తండ్రి లాంటి స్థానంలో ఉండి చూపించిన ఆదరణగా ఎందుకు చూడకూడదు? చూసే కళ్లను బట్టి, మన ఆలోచనలను బట్టి కూడా కొన్నిసార్లు విషయాలు మారిపోతాయి. ఎలాంటి కల్మషం లేకుండా చేసిన ఒక సాధారణ స్పర్శను కూడా విశ్లేషణల పేరుతో వివాదాలుగా మార్చి, మీడియాలో రచ్చ చేయడం అనేది మరో కోణంగా చూడాలి.
80ల నాటి పరిస్థితులతో పోలిస్తే... నేటి డిజిటల్ యుగంలో ప్రతి చిన్న విషయాన్ని వివాదంగా మార్చడానికి, సంచలనాలకు తెరలేపడానికి మీడియా ఎప్పుడూ సిద్ధంగా ఉందనే పచ్చి నిజాన్ని సదరు సీనియర్ దర్శకులు, ఇండస్ట్రీ పెద్దలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటి సామాజిక వాతావరణం వేరు, ఇప్పటి సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రపంచం వేరు. కాబట్టి పాత తరం వారు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోకపోతే... లేనిపోని వివాదాల్లో చిక్కుకుని ప్రతిష్టను కోల్పోవాల్సి వస్తుంది.