'రావు బహదూర్'.. స్ట్రాటజీనా? లేక కాన్ఫిడెన్సా?
అయితే ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న రావు బహదూర్ చిత్ర ప్రమోషన్లు చూస్తుంటే, సాధారణ ప్రచారానికి మించి డిస్కషన్స్ కు దారి తీసే స్ట్రాటజీని చిత్ర బృందం అనుసరిస్తోందా అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ప్రతి చిత్ర బృందానికి అత్యంత కీలకమైన అంశం. ముఖ్యంగా భారీ స్టార్ పవర్ లేకుండా వస్తున్న సినిమాల విషయంలో ప్రమోషన్లు మరింత కీలకంగా మారాయి. అయితే ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న రావు బహదూర్ చిత్ర ప్రమోషన్లు చూస్తుంటే, సాధారణ ప్రచారానికి మించి డిస్కషన్స్ కు దారి తీసే స్ట్రాటజీని చిత్ర బృందం అనుసరిస్తోందా అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ వెంకటేష్ మహా తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన స్థాయిలో నటించగల కొత్తతరం నటుడు కనిపిస్తే తాను నటన నుంచి తప్పుకుంటానని చెప్పిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, అలాంటి నటుడు ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఉన్నాడని, అతడే సత్యదేవ్ అని వెంకటేష్ మహా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సత్యదేవ్ టాలెంట్‌పై ఎవరికీ డౌట్స్ లేకపోయినా, అతడిని నేరుగా కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడితో పోల్చడం అతిశయోక్తిగా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వివాదం కేవలం ఒక కామెంట్ తో మొదలైంది కాదు. ఇప్పటికే సినిమా టీజర్ రిలీజ్ టైమ్ లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన సినిమాలతో పోలికలు తీసుకురావడం కూడా చర్చనీయాంశమైంది.
ఈ కామెంట్స్ నిజంగానే మేకర్స్ తమ కంటెంట్‌పై ఉన్న అపారమైన నమ్మకానికి ప్రతీకలా? లేక కావాలనే డిస్కషన్స్ పెట్టేలా చేసి సినిమా పేరును ప్రేక్షకుల మధ్య నిలబెట్టేలా చేయాలనే ప్రమోషనల్ స్ట్రాటజీనా అనే ఆసక్తికరమైన ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో వివాదం కూడా ఒక మార్కెటింగ్ వెపన్ లాగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఒక ప్రకటనపై విమర్శలు వచ్చినా, మద్దతు వచ్చినా, చివరికి ఆ సినిమా పేరు మరింత మందికి చేరుతుంది. ముఖ్యంగా భారీ పోటీ మధ్య రిలీజవుతున్న సినిమాలకు ఇలాంటి డిస్కషన్స్ ఎక్స్‌ట్రా విజిబిలిటీని తీసుకువస్తాయి. రావు బహదూర్ విషయంలో కూడా అదే జరుగుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వ్యూహానికి మరోవైపు ప్రమాదం కూడా ఉంది. ఒకసారి ప్రేక్షకుల అంచనాలు అసాధారణ స్థాయికి చేరుకుంటే, సినిమా కూడా అదే స్థాయిలో నిలబడాల్సి ఉంటుంది. కమల్ హాసన్ వంటి నటనా దిగ్గజాలు, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి మైల్‌స్టోన్ సినిమాలతో పోలికలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు సాధారణ సినిమాను అంగీకరించే పరిస్థితి ఉండదు.
జూలై 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న రావు బహదూర్‌పై ప్రస్తుతం ఉన్న డిస్కషన్ మొత్తం చిత్ర యూనిట్‌కు అనుకూలంగానే కనిపిస్తున్నా, చివరికి ఈ ప్రమోషనల్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తొలి రోజు ప్రేక్షకుల తీర్పే నిర్ణయించనుంది. ఎందుకంటే వివాదాలతో హైప్‌ను సృష్టించడం సాధ్యమే కానీ ఆ హైప్‌ను నిలబెట్టేది మాత్రం తెరపై కనిపించే కంటెంట్ మాత్రమే.