హీరోలేమైనా పైనుంచి ఊడిప‌డ్డారా?

Update: 2020-03-06 16:30 GMT
ఏ విష‌యాన్ని అయినా కుండ బ‌ద్ద‌లు కొట్టేలా చెప్పాలంటే బోలెడంత గ‌ట్స్ ఉండాలి. గుండెల్లో ద‌మ్ము ట‌న్నుల కొద్దీ ఉండాలి. ఈ కోవ‌కే చెందుతుంది శ్రుతిహాస‌న్‌. ముక్కు సూటిత‌నంగా మాట్టాడ‌టంలో ఎలాంటి జంకు గొంకు ఉండ‌ని న‌టిగా ఇండ‌స్ట్రీలో పాపుల‌రైంది. ఒక్కోసారి శ్రుతి స్లోగ‌న్ లు చూసి కొన్ని మ‌హిళా సంఘాలు సైతం శ‌భాష్ అంటూ కితాబిచ్చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే ఆమె కొన్ని సినిమా ఆఫ‌ర్ల‌ను పోగొట్టుకుందిట‌. సినిమా అవ‌కాశాలు రాక‌పోయినా నాకు ఫ‌ర్వాలేదు.. నా శైలిని మాత్రం వ‌దులుకోన‌ని ఈ అందాల భామ క‌రాఖండిగా చెప్పింది.

ఇలాంటి మ‌నోబ‌ల‌మే శ్రుతి ఇండ‌స్ట్రీ లో నిల‌దొక్కుకునేలా చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఇంత‌కీ ఆ వ్యాఖ్య‌లు ఏంటంటే.. సినీ ఇండస్ట్రీ లో మ‌గ‌వారి కంటే ఆడ‌వారికి ప్రాధాన్య‌త త‌క్కువ‌. ఇది కొత్త‌ స‌మ‌స్య కాదు.. కాలం మారినా ఈ తీరు మార‌డం లేదు`` అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. హీరోల‌కు ఒక ర‌క‌మైన ప్రిఫ‌రెన్స్ ఇస్తారు.. హీరోయిన్ల‌కు వేరే ర‌క‌మైన ట్రీట్‌మెంట్ ఉంటుంద‌ని ..ఇది త‌న‌కు ఎంత మాత్రం న‌చ్చ‌ద‌ని అందాల శ్రుతి తేల్చేసింది.

త‌న ఇంటి పేరు కూడా త‌న‌కు ఎలాంటి స‌పోర్టు ఇవ్వ‌లేద‌ని ఈ స‌న్న‌జాజి ఒకింత మ‌ద‌న ప‌డుతూ చెప్పింది. వార‌స‌త్వ న‌టి అన్న దానిపైనా తప్పుగా మాట్లాడార‌ని-ఇలాంటి వారికి కామెంట్ల‌ను అస‌లు ఖాత‌రు చేయ‌న‌ని ఒక ర‌కంగా హెచ్చ‌రిక‌గా చెప్పింది. అయితే ఇండ‌స్ట్రీ లో కొన్ని విష‌యాలు త‌న మ‌న‌సునెంతో బాధ పెట్టాయ‌ని వాపోయింది. కానీ ఇక్క‌డ హీరోలు పై నుంచి ఊడిప‌డ్డారా అనే స్థాయిలో వ్య‌వ‌హరిస్తున్నార‌ని.. ఇది ఎంత‌కీ మంచిది కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. తాను సెట్లోకి వెళితే కుర్చీ కూడా ఇచ్చేవారు కాద‌ని.. అదే చిన్న హీరోల‌కు కూడా రాచ‌ మ‌ర్యాద‌లు చేసేవార‌ని.. త‌మ‌కు ఎలాంటి గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని తెగ ఫీలైపోయింది. అయితే న‌టీమ‌ణుల కు అండ‌గా ఈ సుంద‌రి చేస్తున్న పోరాటం మంచిదేగానీ.. మ‌రీ ఇంత వివ‌క్ష ఉంటే అనువుగాని చోట అధికుల‌మ‌న‌డం ఎందుకు? అయినా ఇక్క‌డే ఉండ‌ట‌మెందుకు? అని సోష‌ల్ మీడియా వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఇక‌పోతే శ్రుతి ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్ అనే చిత్రంలో న‌టించ‌నుంది.
Tags:    

Similar News