వారి స‌పోర్ట్ ను మ‌ర్చిపోలేను

పెళ్లి తర్వాత కెరీర్‌లో మరింత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న లావణ్య త్రిపాఠి కొణిదెల నుంచి ఇప్పుడు మరో వినోదాత్మక చిత్రం రాబోతుంది.;

Update: 2026-02-12 06:29 GMT

పెళ్లి తర్వాత కెరీర్‌లో మరింత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న లావణ్య త్రిపాఠి కొణిదెల నుంచి ఇప్పుడు మరో వినోదాత్మక చిత్రం రాబోతుంది. మొన్నా మ‌ధ్య మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు ‘సతీ లీలావతి’ సినిమాతో మార్చి 6న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించగా, తాతినేని సత్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ పాల్గొంది.



 


పూర్తి స్థాయి వినోదాత్మ‌క చిత్రం సతీ లీలావ‌తి

సతీ లీలావతి ప్రారంభమైనప్పుడు తాను గర్భవతిని అని, అయినప్పటికీ దర్శకుడు, నిర్మాతలు ఇచ్చిన స‌పోర్ట్ తో కేవలం మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయ‌గ‌లిగాన‌ని లావ‌ణ్య చెప్పారు. ఆ టైమ్ లో నాకు అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేన‌ని, సప్తగిరి గారితో వ‌ర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింద‌ని, ఈ మూవీలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించార‌న్నారు. ముఖ్యంగా దేవ్ మోహన్ గారి నటన ప్రేక్షకులను మెప్పిస్తుందని, ఇది పూర్తి ఎంట‌ర్టైనింగ్ మూవీ అని, కుటుంబ సమేతంగా చూడదగిన ఈ మూవీని మార్చి 6న థియేటర్లలో చూసి పెద్ద హిట్ చేయాలని లావ‌ణ్య ప్రేక్ష‌కుల్ని కోరారు.



 


ఆ సినిమాతో పోల్చ‌డం స‌రికాదు

డైరెక్ట‌ర్ తాతినేని సత్య మాట్లాడుతూ, కమల్ హాసన్ గారు నటించిన సతీ లీలావతి మూవీతో త‌మ సినిమాను కంపేర్ చేయ‌డం స‌రైన‌ది కాద‌ని, త‌మ సినిమా కథ పూర్తిగా భిన్నమైనదని, అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్ రిలేట్ అయ్యేలా, అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను రూపొందించామ‌ని, సినిమాలో పూర్తి వినోదంతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయ‌న్నారు. మార్చి 6న ప్రేక్షకులు స‌తీ లీలావ‌తి సినిమాను ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంద‌న్నారు.

ఎన్నో విష‌యాల‌ను నేర్పించింది

నిర్మాత నాగ మోహన్ మాట్లాడుతూ, నిర్మాతగా ఇది త‌న‌కు మొద‌టి సినిమా అని, ఈ మూవీ జ‌ర్నీ త‌న‌కెన్నో విష‌యాల‌ను నేర్పించింద‌ని, స‌తీ లీలావ‌తిని మంచి కంటెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా మార్చి 6న విడుదల చేస్తున్నామ‌న్నారు.

ఆ స్థాయి స‌క్సెస్ అవుతుంది

నటుడు సప్తగిరి మాట్లాడుతూ, గ‌తంలో వ‌చ్చిన సతీ లీలావతి ఎంత పెద్ద స‌క్సెస్ ను సాధించిందో, త‌మ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. నిర్మాతకు ఇది తొలి ప్రయత్నమ‌ని, దర్శకుడు సత్యకి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభమ‌వుతుంద‌ని, ఈ మూవీ ఫుల్ ఎంట‌ర్టైనింగ్ గా ఉంటుంద‌ని స‌ప్త‌గిరి చెప్పారు.

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్‌తో పాటు నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు నటించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. వినోదానికి ప్రాధాన్యం ఇస్తూ రూపొందిన ఈ మూవీ ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News