'జననాయగన్' అప్పుడే రిలీజై ఉంటే..?
ఈ రోజు సినిమా చూసిన వాళ్లు కూడా దీనికి, ‘భగవంత్ కేసరి’కి సంబంధమే లేదని అంటున్నారు.
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించి నంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్.. రాజకీయాల్లోకి వెళ్లబోతూ చేసిన చివరి సినిమా కోసం ‘భగవంత్ కేసరి’ రీమేక్‌ను ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ పేరుకే ఇది రీమేక్ అని.. చాలా మార్పులు చేర్పులు చేశారని ‘జననాయగన్’ ప్రోమోలు చూసినప్పుడే అర్థమైంది. ఈ రోజు సినిమా చూసిన వాళ్లు కూడా దీనికి, ‘భగవంత్ కేసరి’కి సంబంధమే లేదని అంటున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన మంచి సినిమాను బాగా చెడగొట్టేశారనే టాక్ తెలుగు ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ‘భగవంత్ కేసరి’ మూల కథను, కొన్ని సన్నివేశాలను మాత్రం తీసుకుని.. మిగతా కథంతా మార్చేశాడు దర్శకుడు వినోద్. మొత్తంగా ఈ సినిమా చూశాక ఇది కేవలం విజయ్ రాజకీయ ప్రయోజనం కోసం తీసిన సినిమా అని స్పష్టంగా అర్థమైపోయింది. ఇందులో పొలిటికల్ మసాలా మామూలుగా దట్టించలేదు.
‘‘ఎవరు ఆపాలని చూసినా నేను ఆగను.. నేను వస్తున్నా’’.. ‘‘నేను వచ్చేశాను. ఇకపై అవినీతి కార్యక్రమాలు అన్నీ ఆపేయండి’’.. ‘‘ఓటు వేసే జనాలను మూర్ఖులు అనుకుంటే దాన్ని మించిన మూర్ఖత్వం లేదు’’.. ‘‘చేంజ్ అనేది ఒక ప్రాసెస్’’.. ఇలా విజయ్ నోటి నుంచి లెక్కలేనన్ని పొలిటికల్ డైలాగులు చూడొచ్చు ‘జననాయకుడు’లో. ఆయన్ని ఒక లీడర్‌గా ప్రొజెక్ట్ చేయడం కోసం బోలెడన్ని సన్నివేశాలు, డైలాగులు పెట్టాడు దర్శకుడు హెచ్.వినోద్. ఎంజీఆర్‌కు విజయ్ రాజకీయ వారసుడన్నట్లు.. ఆయన ఆశీర్వాదం విజయ్‌కి ఉన్నట్లు కూడా ఇందులో ఒక సీన్ పెట్టారు.
ఎంజీఆర్ స్వయంగా.. విజయ్‌ని తంబి అని సంబోధిస్తూ అతణ్ని ఆశీర్వదించినట్లు చూపించడం గమనార్హం. ఒక సీన్లో ఓ మహిళ విజయ్ చేతికి జెండా ఇచ్చి, మా మహిళలంతా నీ వెంటే ఉంటాం అనే డైలాగ్ చెప్పడం.. ‘‘మన నాయకుడు వీడే.. మన భవిత వీడే’’ అంటూ లిరిక్స్ పెట్టడం.. ఒక సీన్లో విజయ్ ఒక పొలిటికల్ లీడర్ ఇంట్లో కుర్చీలు విరగ్గొట్టడం.. ఇలా దళపతి రాజకీయ ప్రయోజనం కోసం పెట్టిన సీన్లు-డైలాగులకు లెక్కే లేదు.
ఇవన్నీ చూస్తే రాజకీయ ప్రయోజనం కోసమే విజయ్ ఈ సినిమా చేశాడన్నది స్పష్టం. అందుకే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు దగ్గర అడ్డంకులు ఎదురై ఉంటాయని భావిస్తున్నారు. కానీ దీన్ని ఇన్ని నెలల పాటు ఆపాల్సినంత అవసరం అయితే కనిపించదు. ఐతే విజయ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న నేపథ్యంలో ఈ సీన్లు, డైలాగులు అన్నీ రెలవెన్స్ కోల్పోయాయి. సంక్రాంతికి అనుకున్నట్లే ఈ సినిమా రిలీజై ఉంటే.. తమిళ ప్రేక్షకులు వీటితో బాగా కనెక్ట్ అయ్యేవారేమో.