సెన్సార్ వాళ్ళు నరకొద్దు అన్నారు

Update: 2018-01-14 05:37 GMT
సినిమాల్లో హింస - అశ్లీలత హద్దులు దాటకుండా ఉండటం కోసం సెన్సార్ బోర్డ్ ఉందన్న సంగతి తెలిసిందే. కాలక్రమేణా వస్తున్న మార్పులకు తగట్టు ఒకప్పుడు బాగా కఠినంగా ఉన్న నిబంధనలు సడలించుకుంటూ రావడం వల్లే ఇప్పుడు వస్తున్న వాటిలో మోతాదు మించి హింసను, అంగాంగ ప్రదర్శనలు చూస్తున్నాం. ఇది బాలీవుడ్ లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలో ఈ రకమైన పోకడలు పెరుగుతున్నాయి. కాని ఒకప్పుడు సెన్సార్ నిబంధనలు ఎంత కట్టుదిట్టంగా ఉండేవో, వాటి కోసం దర్శకులు, రచయితలు ఏకంగా తమ సీన్లను రీ షూట్ చేసే దాకా ఎలా వచ్చేవారో ఋజువు చేసే పాత జ్ఞాపకం ఇది.


భారతీయ సినిమా చరిత్రలో షోలేకున్న స్థానం చెక్కుచెదరనిది. కమర్షియల్ సినిమాకు కొత్త నడకలు నేర్పిన ఈ మూవీని ప్రేమించే ప్రేక్షకులు ఇప్పటి జనరేషన్ లో కూడా ఉన్నారు అని చెప్పడానికి ఇందులోని పాత్రలను సినిమా పేర్లుగా వాడుకోవడమే చక్కని ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టైటిల్ ఇందులోని విలన్ పాత్ర పేరు అన్న సంగతి తెలిసిందే. షోలే ప్రభావం ఆ స్థాయిలో ఉంది. ఇప్పటికీ ఈ మాస్టర్ పీస్ రెఫరెన్సులు అన్ని బాషా సినిమాల్లో కనిపిస్తూనే ఉంటాయి.


పూర్తి కమర్షియల్ యాక్షన్ సినిమా అయిన షోలేలో చాలా హత్యలు ఉంటాయి. అన్ని విలన్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ చేసేవే. కథ పరంగా చదువుకుంటే అవన్నీ ఒళ్ళు జలదరించేలా రాసుకున్నారు. కాని సినిమాలో ఎక్కడా కూడా మితిమీరిన హత్యా కాండ, తలలు తెగిపడటం, చేతులు కత్తిరించేది నేరుగా చూపడం లాంటివి ఉండవు . కారణం సెన్సార్ నిబంధనలే. క్లైమాక్స్ లో సంజీవ్ కుమార్ పాత్ర అమ్జాద్ ఖాన్ చేతులు నరకడం మొదట షూట్ చేసారు. కాని సెన్సార్ దీనికి అభ్యంతరం చెప్పింది. మాజీ పోలీస్ ఆఫీసర్ అలాంటి చర్యకు పాల్పడ్డం పట్ల నో చెప్పింది. దీంతో మార్చి తీసి గబ్బర్ సింగ్ ని అరెస్ట్ చేసినట్టు రీ షూట్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నారు. అదే ఇప్పుడైతేనా ఏకంగా తల నరికి గాల్లో ఎగరేసినా యు/ఎ  ఇచ్చేసి పని జరుపుకుంటారు.
Tags:    

Similar News