స్పెయిన్ లో 'సర్కారువారి పాట' .. యాక్షన్ లోకి దిగుతున్న మహేశ్ బాబు!

Update: 2021-10-02 11:30 GMT
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా, మహేశ్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను 'స్పెయిన్'లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ షూటింగు కోసం మహేశ్ బాబు అండ్ టీమ్ అక్కడికి వెళ్లింది. వచ్చేవారం నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మరికొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొననుంది.

ఈ సినిమా కోసం ముందుగా 'దుబాయ్'లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. దుబాయ్ రోడ్లపై .. ఏడారి లోను భారీ ఛేజింగ్స్ ను షూట్ చేశారు. ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
ఆ తరువాత 'గోవా'లోను కొన్ని యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు. రామ్ - లక్ష్మణ్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను తెరపై చూస్తూ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని అంటున్నారు. ఇక ఇప్పుడు 'స్పెయిన్'లోను యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారన్న మాట.

ఈ నెలాఖరువరకూ ఈ షూటింగు 'స్పెయిన్' లోనే జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయితే 75 శాతవరకూ షూటింగు పార్టు పూర్తయినట్టేనని చెబుతున్నారు. ఆ తరువాత ఈ సినిమా టీమ్ హైదరాబాద్ చేరుకోనుంది. మిగతా షూటింగ్ అంతా కూడా హైదరాబాద్ లోనే జరుగుతుందని అంటున్నారు. హైదరాబాద్ లో జరిగే షూటింగుతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, ముందుగా చెప్పిన ప్రకారం జనవరి 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మహేశ్ బాబు గత మూడేళ్లుగా ఏడాదికి ఒక హిట్ చొప్పున అందిస్తూ వస్తున్నాడు. 'భరత్ అనే నేను' .. 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు' ఒకదానికి మించి ఒకటి విజయాలను అందుకున్నాయి. రికార్డుస్థాయి వసూళ్లను కొల్లగొట్టాయి. హ్యాట్రిక్ హిట్ తరువాత చేస్తున్న సినిమా కావడం వలన, ఆయన 'సర్కారువారి పాట' విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది .. కావలసినంత కామెడీని కలుపుకుని సాగుతుంది. అందువలన ఈ సినిమా విషయంలో మహేశ్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఇటీవల ఆయన తన అభిమానులతో మాట్లాడుతూ, పూరి స్కూల్ నుంచి పరశురామ్ వచ్చాడనీ .. అందువలన ఈ సినిమా 'పోకిరి'ని గుర్తుచేస్తుందని చెప్పాడు. అప్పటి నుంచి అందరిలో మరింతగా ఆసక్తి పెరుగుతూ పోతోంది. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక 'దూకుడు' తరువాత మహేశ్ - వెన్నెల కిషోర్ మధ్య ఆ స్థాయి కామెడీ పండుతుందని చెబుతున్నారు. సముద్రఖని ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్ చేస్తున్నాడు. 'అల వైకుంఠపురములో' .. 'క్రాక్' సినిమాల్లో విలన్ గా తన విశ్వరూపం చూపించిన సముద్రఖని, అంతకంటే పవర్ఫుల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. ఈ పాత్ర చాలాకాలం పాటు జనాలకు గుర్తుండిపోతుందని చెప్పుకుంటున్నారు.


Tags:    

Similar News