క్రైమ్ థ్రిల్లర్ కథలు రాయాలంటే ఎదురయ్యే సవాళ్లు?
సస్పెన్స్ థ్రిల్లర్లు రాయడంలో సవాళ్ల గురించి.. జీతూ జోసెఫ్ మాట్లాడారు. థ్రిల్లర్లు రాయడంలో లాజిక్ వర్సెస్ మ్యాజిక్ చూడాలి.;
క్రైమ్ థ్రిల్లర్ కథలు రాయాలంటే అంత సులువు కాదు! ఇలాంటి కథల్లో సస్పెన్స్ ని మెయింటెయిన్ చేస్తూనే, హీరో విలన్ మధ్య ఎలుకా పిల్లి ఆటను బాగా ఆడించాలి. దానికి తోడు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే చాలా ఎలిమెంట్స్ విషయంలో సక్సెసవ్వాలి. ఈ విషయంలో విజయం సాధించాడు గనుకనే జీతూ జోసెఫ్ లాంటి దర్శకరచయిత దృశ్యం ఫ్రాంఛైజీలో వరుసగా విజయాల్ని నమోదు చేస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీలో రూపొందించిన మలయాళ సినిమాలకు ధీటుగా తెలుగు, తమిళం, హిందీ వెర్షన్లు కూడా విజయం సాధిస్తున్నాయి.
అయితే జీతూ దృశ్యం ఫ్రాంఛైజీని ఇంకా ఎంతవరకూ పొడిగించనున్నారు? దృశ్యం 3 తో ఫ్రాంఛైజీని ముగించేస్తున్నాడా? దృశ్యం 4 ఉంటుందా? ఉండదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జీతూ జోసెఫ్ స్వయంగా సమాధానమిచ్చారు. విజయవంతమైన దృశ్యం ఫ్రాంఛైజీని కొనసాగించేందుకు ఎదురయ్యే సవాళ్లు ఏంటో మాట్లాడారు.
జీతూ జోసెఫ్ తాజా ఇంటర్వ్యూ ప్రకారం, దృశ్యం 3 ఈ ఫ్రాంఛైజీలో చివరి భాగం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ భాగంతో ముగించాలంటే దానికి పకడ్భందీ క్లైమాక్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే జీతూ జోసెఫ్ చాలా కసరత్తు చేసానని తెలిపారు. తన వద్ద `దృశ్యం 3`కి సంబంధించిన ఒక అద్భుతమైన ముగింపు సిద్ధంగా ఉంది. అది జార్జ్ కుట్టి కథను ఒక లాజికల్ ముగింపుకు తీసుకెళ్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలిపారు.
అంతేకాదు ఈ ఫ్రాంఛైజీలో `దృశ్యం 4` ఉంటుందా ఉండదా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి `దృశ్యం 4` చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక కథను సాగదీయడం కంటే, అది పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే గౌరవప్రదంగా ముగించడం మంచిదని నమ్ముతున్నట్టు జీతూ అంగీకరించారు.
ఇలాంటి విజయవంతమైన సిరీస్‌ను ఆపేయడానికి ప్రధాన కారణం కథలో క్వాలిటీ అవసరమని తాను నమ్ముతున్నట్టు జీతూ తెలిపారు. ప్రతి భాగంలోనూ జార్జ్ కుట్టి పోలీసుల కంటే తెలివిగా ఆలోచించాలి. మూడవ భాగంలో కూడా అదే స్థాయి ఉత్కంఠను కొనసాగించడం చాలా కష్టం. పైగా అప్పటికే తెలిసిన పాత్ర ఇది. ప్రేక్షకులు జార్జ్ కుట్టిని ఒక సూపర్ హీరోలా చూస్తున్నారు. కథలో చిన్న తప్పు దొర్లినా ఫ్రాంఛైజీ మొత్తం పరువు పోతుంది. అందుకే `దృశ్యం 3`తో సరైన ముగింపునివ్వాలని తాను ప్రయత్నిస్తున్నట్టు జీతూ వెల్లడించారు.
సస్పెన్స్ థ్రిల్లర్లు రాయడంలో సవాళ్ల గురించి.. జీతూ జోసెఫ్ మాట్లాడారు. థ్రిల్లర్లు రాయడంలో లాజిక్ వర్సెస్ మ్యాజిక్ చూడాలి. ఇది వర్కవుటవ్వడం అంత సులువు కాదు. క్రైమ్ థ్రిల్లర్ రాయడం అంటే ఒక చెస్ గేమ్ ఆడినట్లుగా ఉంటుందని జీతూ భావిస్తున్నారట. రచయితగా పోలీసుల తరపున, నేరస్తుడి తరపున రెండింటి వైపులా ఆలోచించాలి. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో చిన్న లోటుపాట్లు ఉన్నా ప్రేక్షకులు కనిపెట్టేస్తారు. కథలో పోలీసులు ఎంత తెలివిగా ఉన్నారో చూపిస్తేనే.. వారిని జార్జ్ కుట్టి ఎలా బురిడీ కొట్టించాడనేది పండుతుంది. ఇలాంటి ఎలుకా పిల్లి ఆటను రాయడమే అతిపెద్ద ఛాలెంజ్. ఇలాంటి కథల్లో కేవలం సస్పెన్స్ ఉంటే సరిపోదు, ఆ కుటుంబం పడే ఆవేదన ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి. అదే `దృశ్యం` సక్సెస్ సీక్రెట్ అని కూడా జీతూ జోసెఫ్ వెల్లడించారు.
తెలుగులో వెంకటేష్ హీరోగా దృశ్యం 3 ఉంటుందా?
ఈ ప్రశ్నకు సమాధానం `అవును` అనడానికి బలమైన కారణాలు ఉన్నాయి. వెంకీ నటించిన దృశ్యం, దృశ్యం 2 విజయవంతం అయ్యాయి. రాంబాబు పాత్రలో వెంకటేష్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే మలయాళ వెర్షన్ లో నటించిన మోహన్ లాల్ కి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు అటు హిందీ వెర్షన్‌లో నటించిన అజయ్ దేవగన్ కి, ఇటు తెలుగు వెర్షన్ లో నటించిన వెంకటేష్ కి పేరొచ్చింది. ఇప్పుడు పార్ట్ 3 ని కూడా తెలుగు-హిందీలోను ఒకేసారి లేదా వెంటవెంటనే షూట్ చేసే ప్లాన్ ఉందని కూడా జీతూ హింట్ ఇచ్చారు. అన్ని భాషల్లోనూ ఒకేసారి సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు గుసగుస వినిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల క్లైమాక్స్ లీక్ అయితే థ్రిల్ పోతుంది. కాబట్టి వెంకటేష్ తో తెలుగు వెర్షన్ పట్టాలెక్కడం ఖాయమని కూడా భావిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు.. జీతూ జోసెఫ్ ప్రస్తుతం మోహన్ లాల్‌తో `రామ్` అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ పనుల్లో ఉన్నారు. అది పూర్తయిన వెంటనే `దృశ్యం 3` స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతారని సమాచారం.జార్జ్ కుట్టి (రాంబాబు) ఈసారి పోలీసుల నుంచి శాశ్వతంగా తప్పించుకుంటాడా లేదా దొరికిపోతాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.