రూట్ మార్చిన శివాజీ.. ఇకపై అలాంటి వాటికి నో ఛాన్స్!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి మనం మాట్లాడే మాటలు సినిమా కంటే ఎక్కువ చర్చ చేస్తుంటాయి.;
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి మనం మాట్లాడే మాటలు సినిమా కంటే ఎక్కువ చర్చ చేస్తుంటాయి. గతంలో 'దండోరా' సినిమా ప్రమోషన్స్ సమయంలో శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో మనందరికీ తెలిసిందే. అయితే, ఆ చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టేసి, ఇప్పుడు సరికొత్త పంథాలో తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు శివాజీ. పాత వివాదాల నుండి పాఠాలు నేర్చుకుని, తన రూట్ మార్చినట్లు తాజాగా 'సాంప్రదాయిని సుప్పినీ సుద్ధపూసనీ' మూవీ వేడుకలో స్పష్టమయ్యింది. అనిల్ రావిపూడి గెస్ట్ గా ఈ మూవీ ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఆ సరదా ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాలు ఇలా వున్నాయి..
అనిల్ రావిపూడితో శివాజీ ఫన్నీ కన్వర్జేషన్:
'సాంప్రదాయిని సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు పిలవడానికి శివాజీ ఫోన్ చేసినప్పుడు, పాత విషయాలను గుర్తు చేస్తూ ఇద్దరి మధ్య సరదా సంభాషణ సాగిందట. "గతంలో 'దండోరా' ఈవెంట్‌కు వచ్చి వివాదాల్లో ఇరుక్కున్నాను.. ఇప్పుడు మళ్ళీ రమ్మంటే ఏమనుకుంటారో అని భయపడ్డాను" అని శివాజీ తనతో అన్నట్లు అనిల్ వెల్లడించారు. దానికి అనిల్ స్పందిస్తూ, ఆ సినిమాకైనా ఈ సినిమాకైనా ఖచ్చితంగా వస్తానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో పాత వివాదాలను ప్రస్తావిస్తూ వారిద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకోవడం అక్కడ నవ్వులు పూయించింది.
పాత వివాదాలపై సెటైరికల్ క్లారిటీ:
ఆడవారి వస్త్రధారణపై గతంలో చేసిన కామెంట్స్ వల్ల వచ్చిన విమర్శలను శివాజీ దృష్టిలో ఉంచుకున్నారు. అనిల్ రావిపూడితో ఫోన్‌లో మాట్లాడుతూనే.. "ఈసారి నేను అలాంటి కామెంట్స్ చేయను, చాలా బుద్ధిగా ఉంటాను" అని సరదాగా హామీ ఇచ్చినట్లు ఈవెంట్ సాక్షిగా తెలిసింది. తన మాటల వల్ల అనవసరమైన వివాదాలు రాకూడదని, ఇప్పుడు చేస్తున్న సినిమా పేరుకు తగ్గట్టే ప్రమోషన్లలో కూడా చాలా 'సాంప్రదాయం'గా వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
సాంప్రదాయిని సుప్పినీ సుద్ధపూసనీ - మూవీ విశేషాలు:
ఒకప్పుడు అదిరిందయ్యా చంద్రం ,మిస్సమ్మ లాంటి మూవీస్ తరువాత ఇంతకాలానికి శివాజీ, లయ జంటగా మళ్ళి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. టైటిల్ విభిన్నంగా ఉన్నా, కథలో మాత్రం తెలుగు కుటుంబాలలోని విలువలు, హాస్యం కలగలిసి ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ట్రైలర్ చూస్తుంటే శివాజీ మార్క్ టైమింగ్, లయ హోమ్లీ , నటుడు రోహన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దక్కన్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని శివాజీ పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి ఈటివి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియాట్ చేస్తుందో చూడాలి.