`రోబో 2.0` ఆడియో లాంచ్‌...హోస్ట్ గా రాణా?

Update: 2017-10-26 17:07 GMT
ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్  హీరోలు యాంక‌ర్లుగా - హోస్ట్ లుగా కూడా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌ - చిరంజీవి - ఎన్టీఆర్‌ - రాణా లు బుల్లితెర హోస్ట్ లు గా మంచి మార్కులు సంపాదించారు. భ‌ల్లాల దేవుడు రాణా ఇంకో అడుగు ముందుకు వేసి ఐఫా అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. న్యాచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి ఆ వేడుక‌లలో రాణా చేసిన హంగామా ఆహూతుల‌ను అల‌రించింది. అయితే, అదే త‌ర‌హాలో రాణా మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ - త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ల కాంబోలో తెర‌కెక్కిన `రోబో 2.0` చిత్ర ఆడియో వేడుక తెలుగు వెర్ష‌న్ కు రాణా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడ‌ట‌.

`రోబో 2.0` చిత్ర ఆడియో వేడుక రేపు దుబాయ్‌ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆడియో వేడుక కోసం దాదాపు రూ.15 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌బోతున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ ఈవెంట్ తెలుగు వెర్షన్ కు హోస్ట్ గా రాణాను ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఐఫా వేడుక‌ల‌లో రాణా చేసిన సంద‌డి అంద‌రినీ అల‌రించ‌డంతో ఈ వేడుక‌కు అత‌డిని సంప్ర‌దించార‌ట‌. అలాగే, త‌మిళ వెర్ష‌న్‌ ఆడియో కార్యక్రమానికి `స్పైడ‌ర్‌` లో న‌టించిన ఆర్జే బాలాజీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఆ చిత్ర యూనిట్ దుబాయ్ కు చేరుకుంది. ఈ ఆడియో వేడుక సంద‌ర్భంగా మ్యాజిక్ మ్యుజీషియ‌న్‌ ఏఆర్ రెహ‌మాన్ లైవ్ కాన్స‌ర్ట్ కూడా ఉంటుంద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హాజ‌రుకాబోతున్నాడ‌ని స‌మాచారం. 
Tags:    

Similar News