వ‌ర్మ చెప్పిందీ పాయింటే మ‌రి!

Update: 2015-07-20 07:17 GMT
ఒక సినిమా హిట్ట‌యితే ప‌రిశ్ర‌మ‌ లో ఉత్సాహం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంటుంది. వెంట‌నే మ‌నం కూడా అలాంటి సినిమా చేద్దాం అని ప్లాన్ చేసుకొంటుంటారు దర్శ‌క‌నిర్మాత‌లు. అయితే `బాహుబ‌లి` వ‌చ్చాక మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. స‌గ‌టు  ప్రేక్ష‌కుడు  గ‌ర్వం తో  ఉప్పొంగిపోతున్నారు కానీ... ప‌రిశ్ర‌మ‌ లో మాత్రం స్త‌బ్ధ‌త క‌నిపిస్తోంది. మ‌నం కూడా `బాహుబ‌లి`లాంటి సినిమాని తీద్దాం అని ఎవ్వ‌రూ అనుకోవ‌డం లేదు. ఎందుకంటే అలాంటి సినిమా తీయ‌డం అంత ఆషామాషీ కాదు. ఆ స్థాయి లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి నిర్మాతలు ఉన్నారు కానీ... తీసే ద‌ర్శ‌కులే క‌రువు. అందుకే ప‌రిశ్ర‌మ‌ లో ఒక‌ర‌క‌మైన భ‌యం క‌నిపిస్తోంది. `బాహుబ‌లి`లాంటి సినిమాని చూసిన ప్రేక్ష‌కుల‌కి త‌దుప‌రి ఎలాంటి సినిమాని చూపించా లో కూడా అర్థం కావ‌డం లేదంటూ చాలామంది నిర్మాత‌లు త‌లలుపట్టుకొంటున్నారు.

 ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ కూడా అదే చెబుతున్నాడు. ``బాహుబ‌లి విజ‌యం సాధిస్తుంద‌ని తెలుసు కానీ... అంచ‌నాల‌కి మించిన విజ‌యం సాదించింది. ఏ సినిమా అయినా ప‌దిశాతమో, ఇర‌వై శాత‌మో మించి వ‌సూళ్లు సాధిస్తుంటాయి. కానీ బాహుబ‌లి మాత్రం మూడు రెట్లు ఎక్కువ క‌లెక్ష‌న్లు సాధించింది. ఆ విజువ‌ల్ గ్రాండియ‌ర్ చూసిన ప్రేక్ష‌కుల‌కి ఆ త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌న్నీ చాలా చిన్న‌గా క‌నిపిస్తాయి. అందుకే ప‌రిశ్ర‌మ‌లో ఒక ర‌క‌మైన స్త‌బ్ధ‌త క‌నిపిస్తోంది`` అని వ‌ర్మ ఓ ఇంట‌ర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

అందుకే చిరంజీవి కూడా త‌న 150వ సినిమా `బాహుబ‌లి`ని మించిపోయేలా ఉంటేనే చేయాల‌ని, లేదంటే 150వ సినిమా చేయ‌క‌పోవ‌డ‌మే మేల‌ని  వర్మ అభిప్రాయ‌ప‌డ్డారు.  ఆయ‌న మాట‌లు నిజం కూడా. `బాహుబ‌లి`లాంటి భారీ చిత్రం త‌ర్వాత వెంట‌నే వ‌చ్చే చిత్రం మ‌హేష్ `శ్రీమంతుడు`.  ఆ సినిమా సాధించే ఫ‌లితంపైనే టాలీవుడ్ ప్ర‌యాణం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News