భారతీయ సినిమా విశ్వరూపం: హాలీవుడ్ దిగ్గజాలనే ఆశ్చర్యపరుస్తున్న 'దురంధర్ 2'

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా పేరు మార్మోగుతోంది. ఒకప్పుడు హాలీవుడ్ భారీ చిత్రాలు వస్తున్నాయంటే మన సినిమాలు విడుదల తేదీలను మార్చుకునే పరిస్థితి ఉండేది.;

Update: 2026-03-23 17:21 GMT

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా పేరు మార్మోగుతోంది. ఒకప్పుడు హాలీవుడ్ భారీ చిత్రాలు వస్తున్నాయంటే మన సినిమాలు విడుదల తేదీలను మార్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. రణవీర్ సింగ్ నటించిన `దురంధర్ 2` చిత్రం కోసం హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం తమ సినిమాల విడుదల విషయంలో పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో టాప్ 10 ఓపెన‌ర్ల జాబితాలో 9 హాలీవుడ్ సినిమాలు ఉంటే, వాటితో పాటు దురంధ‌ర్ 2 విడుద‌లై వ‌సూళ్ల‌లో 3వ స్థానాన్ని అందుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కులు దురంధ‌ర్ 2 గురించి హాలీవుడ్ లో భార‌తీయ సినిమా వెలుగుల గురించి టీవీ చానెళ్ల డిబేట్ల‌లో మాట్లాడ‌టం హాట్ టాపిగ్గా మారింది. అయితే దేశీ సినిమా ప్ర‌భ‌ను ప‌రిశీలిస్తే.. ఈ మార్పు కేవలం ఒక సినిమాతో వచ్చింది కాదు. బాహుబలి 2, RRR వంటి భారీ స్పాన్ ఉన్న‌ చిత్రాలు వేసిన బలమైన పునాది ఇప్పుడు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చింది.

ప్రముఖ హాలీవుడ్ దర్శకులు ఫిల్ లార్డ్ , క్రిస్టోఫర్ మిల్లర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారతీయ సినిమా ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``మీ సొంత చిత్ర పరిశ్రమను ఇంత విజయవంతంగా ఎలా తీర్చిదిద్దారు?`` అంటూ వారు సరదాగా ప్రశ్నించడం వెనుక మన సినిమాలపై వారికి ఉన్న గౌరవాన్ని ఆవిష్క‌రించింది. ముఖ్యంగా RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు ఒక కొత్త గుర్తింపును.. మార్కెట్‌ను తెచ్చిపెట్టిందని, అది ప్రస్తుత చిత్రాలకు ఎంతో మేలు చేస్తోందని వారు విశ్లేషించారు.

హాలీవుడ్‌లో ఇప్పుడు `దురంధర్ 2`, `టాక్సిక్` వంటి చిత్రాల గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాల్లోని `మాస్టర్ క్లాస్ స్క్రీన్ ప్లే` - కథా గమనం చూసి అక్కడి టెక్నీషియన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. భారతీయ కథల్లో ప్రపంచాన్ని ఆకర్షించే ఏదో ఒక బలమైన అంశం ఉందని హాలీవుడ్ ఇప్పుడు గుర్తించింది. మన సినిమాల్లోని ఎమోషన్స్, గ్రాండియారిటీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు.

కేవలం వసూళ్ల పరంగానే కాకుండా.. కంటెంట్ పరంగా కూడా మన సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ర్యాన్ గోస్లింగ్ వంటి అగ్ర క‌థానాయ‌కుడు న‌టించిన‌ `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పోటీగా మన సినిమాలు నిలబడటమే కాకుండా.. కొన్ని చోట్ల వాటిని మించి వసూళ్లు సాధించడం గమనార్హం. దీనివల్ల హాలీవుడ్ స్టూడియోలు కూడా ఇప్పుడు భారతీయ సినిమాల విడుదల తేదీలను బట్టి తమ ప్లాన్లను సిద్ధం చేసుకోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ సాగుతోంది. అమెరికాలో అమెరిక‌న్లు భార‌తీయ సినిమాను ఎక్కువ‌గా ఆద‌రిస్తుండడం ఇటీవ‌ల గొప్ప ప‌రిణామం. ఇది భారతీయ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.

భారతీయ సినిమా ఇప్పుడు ఒక ప్రాంతానికో లేదా ఒక భాషకో పరిమితం కాలేదు. హాలీవుడ్ లైవ్ చర్చల్లో మన సినిమాల గురించి.. ఇక్కడి దర్శకుల పనితీరు గురించి ప్రముఖులు మాట్లాడుకుంటున్నారంటే.. మన కంటెంట్ అంతర్జాతీయ స్థాయికి చేరిందని అర్థం. బాహుబలి, RRR తో మొదలుపెట్టిన ఈ ప్రయాణం `దురంధర్ 2` తో మరింత వేగంగా ముందుకు సాగుతోంది. భ‌విష్య‌త్ లో భారతీయ సినిమా ప్రపంచ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా మారడం ఖాయం.

ద‌శాబ్ధం క్రిత‌మే విశ్వ‌నటుడు క‌మ‌ల్ హాస‌న్ ఆస్కార్ ల‌ను మించిన ప్రాముఖ్య‌త ఉన్న‌ పుర‌స్కారాల‌ను భార‌తీయ సినిమా ఇవ్వాల‌ని ఆకాంక్షించిన‌ట్టు... హాలీవుడ్ ని మించిన చిత్ర‌ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లో రూపు దిద్దుకోవాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్న‌ట్టు ప‌రిణామాలు నెమ్మ‌దిగా మారుతున్నాయి.

Tags:    

Similar News