చిరు నెక్స్ట్.. ఏం జరుగుతోంది? లేట్ ఎందుకు?
కథ విషయంలో జరుగుతున్న మార్పులే దీనికి ప్రధాన కారణమని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.;
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి! దర్శకుడు బాబీతో కలిసి చేయాల్సిన ఆ సినిమా షూటింగ్ త్వరలో అధికారికంగా స్టార్ చేస్తారని భావించినప్పటికీ.. లేట్ అవుతూ వస్తోంది. కథ విషయంలో జరుగుతున్న మార్పులే దీనికి ప్రధాన కారణమని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ముఖ్యంగా రెండో భాగం (సెకండ్ హాఫ్) విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి మార్పులు చేసినప్పటికీ, మళ్లీ అదే భాగాన్ని పూర్తిగా రీరైట్ చేయాలని దర్శకుడు బాబీకి సూచించినట్లు తెలిసింది. దీంతో రైటర్స్ టీమ్ మళ్లీ కథపై పని ప్రారంభించినట్లు సమాచారం.
ఇటీవల రోజుల్లో కథల ఎంపికలో చిరంజీవి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో స్ట్రాంగ్ కథ, డెప్త్ ఎమోషన్స్, ఆకట్టుకునే క్లైమాక్స్ వంటి అంశాలపై ఆయన ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కథలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా పలు మార్లు మార్పులు చేయిస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో ఆ జోడీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో, ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే తదుపరి చిత్రంపై నార్మల్ గానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఆ అంచనాలను అందుకునేలా ఉండేందుకు ఈసారి కథ విషయంలో మరింత స్ట్రిక్ట్ గా మెగాస్టార్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కూడా చిరంజీవి సూచనల మేరకు కథను మరింత స్ట్రాంగ్ గా తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో ఎమోషన్, ట్విస్టులు, క్లైమాక్స్ స్ట్రాంగ్ గా ఉండేలా కొత్తగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలా స్టోరీ పూర్తిగా సంతృప్తికరంగా మారిన తర్వాతే సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. దీంతో షూటింగ్ ప్రారంభం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఫైనల్ అవుట్ పుట్ మాత్రం మెరుగ్గా ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో, ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో కంటెంట్ పై దృష్టి పెట్టాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తొందరపడకుండా, అన్ని అంశాలు పక్కాగా సిద్ధమైన తర్వాతే ప్రాజెక్ట్ ను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో మెగాస్టార్ అభిమానులు సినిమా షూటింగ్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.