యంగ్ హీరోల బ్యాక్-టు-బ్యాక్ ప్లానింగ్!
టాలీవుడ్ యువ కథానాయకులు రూటు మార్చారు. ఒక సినిమా విడుదలయ్యాక మరో సినిమాను పట్టాలెక్కించే పాత పద్ధతికి స్వస్తి పలుకుతున్నారు.;
టాలీవుడ్ యువ కథానాయకులు రూటు మార్చారు. ఒక సినిమా విడుదలయ్యాక మరో సినిమాను పట్టాలెక్కించే పాత పద్ధతికి స్వస్తి పలుకుతున్నారు. సెట్స్‌పై ఉండగానే తదుపరి ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. రామ్ పోతినేని, నితిన్, సాయి దుర్గా తేజ్ కెరీర్ స్పీడప్ చేస్తున్నారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ముగ్గురు హీరోలు రాబోయే రెండేళ్ల కోసం పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని తన తదుపరి సినిమాల విషయంలో క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తోంది.
గతంలో ఒక సినిమా తర్వాతే మరొకటి చేసే రామ్ ఇప్పుడు ఒకేసారి రెండు, మూడు కథలపై పని చేస్తున్నారు. విభిన్నమైన జోనర్లను టచ్ చేస్తూ మాస్ సినిమాలతో పాటు క్లాస్ ఆడియన్స్‌కు నచ్చే కథలను ఎంచుకుంటున్నారు. ఇందులో ఒకటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కాగా, మరొకటి కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రం అని తెలిసింది. ఇలా రామ్ బ్యాక్-టూ-బ్యాక్ రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు. మరో యంగ్ హీరో నితిన్ కూడా తన స్పీడును పెంచారు. ప్రస్తుతం వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో నటిస్తున్నారు.
ఈ సినిమాను ఆనంద్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఫాంటసీ మూవీతో పాటు నితిన్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ కాగా, మరొకటి పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిసింది. ఈ మూడు సినిమాలతో నితిన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని చూస్తున్నారు.
సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్ గ్రాఫ్ పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకమైన `సంబరాల ఏటిగట్టు` షూటింగ్‌లో తలమునకలై ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తికాకముందే తేజ్ తదుపరి సినిమాను కూడా ఖరారు చేసుకున్నారు. `క` చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకులు సుజిత్ - సందీప్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన కథకు ఓకే చెప్పారు. `సంబరాల ఏటిగట్టు` పనులు పూర్తయిన వెంటనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇలా ఒక భారీ పీరియాడిక్ సినిమా తర్వాత వెంటనే ఒక కొత్త తరహా కాన్సెప్ట్ మూవీని లైన్లో పెట్టడం ద్వారా తన మార్కెట్‌ను స్థిరపరుచుకోవాలని తేజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ స్పీడ్ చూస్తుంటే మెగా అభిమానులకు రాబోయే రోజుల్లో వరుసగా ట్రీట్స్ అందడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ స్టార్స్ అందరూ కేవలం క్వాంటిటీ మాత్రమే కాకుండా క్వాలిటీతో కూడిన సినిమాలను వేగంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్టులను మేనేజ్ చేయడం వల్ల అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకు కూడా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది. రామ్, నితిన్, సాయి దుర్గా తేజ్ అనుసరిస్తున్న ఈ `బ్యాక్-టు-బ్యాక్` స్ట్రాటజీని ఇతర యంగ్ హీరోల కూడా అనుసరించాలి.