ధురంధర్ డైరెక్టర్.. తెలుగులో మూవీ చేయనున్నారా?

బాలీవుడ్‌ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్ పేరు ఈ మధ్య మరింత గట్టిగా వినిపిస్తోంది.;

Update: 2026-03-23 22:30 GMT

బాలీవుడ్‌ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్ పేరు ఈ మధ్య మరింత గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ధురంధర్ సీక్వెల్ ధురంధర్: ది రివెంజ్ భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ విజయంతో బీ టౌన్ లో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ గా మార్చుకున్న ఆదిత్య ధర్, ఇప్పుడు సౌత్ పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తుండటం చర్చనీయాంశమైంది.

ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ భారీ హిట్ సాధించిన నేపథ్యంలో.. ఆదిత్య ధర్ తదుపరి స్టెప్స్ ఎలా ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన ఒక తెలుగు ప్రాజెక్ట్‌ ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా గ్యాంగ్‌ స్టర్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ భారీ సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆ ప్రాజెక్ట్‌ కు దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పేరు వినిపించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో గ్యాంగ్‌ స్టర్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన వర్మ, మళ్లీ అదే జానర్‌ లో సినిమా చేయబోతున్నారన్న వార్తలు అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా సత్య, కంపెనీ వంటి సినిమాలతో ఆయన చూపిన రియలిస్టిక్ స్టైల్‌ ను మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ, ఆదిత్య ధర్ పై వరుసగా ప్రశంసలు కురిపించడం కూడా ఆ వార్తలకు బలం చేకూర్చుతోంది. ఆదిత్య ధర్ పనితీరును కొనియాడుతూ వర్మ చేసిన పోస్టులు వైరల్ అవుతుండటంతో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు, ఆదిత్య ధర్ నిర్మాతగా కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

భారీ రేంజ్ స్టోరీస్, విభిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించాలని ఆయన భావిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా చేయాలన్న ఆలోచన రావడం విశేషంగా మారింది. ఆ ప్రాజెక్టు పూర్తిగా తెలుగు నేపథ్యంలో ఉంటుందా, లేక పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుందా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కథ మాత్రం గ్యాంగ్‌ స్టర్ వరల్డ్ ను ఆధారంగా చేసుకుని ఉంటుందని సమాచారం.

అలాగే ప్రముఖ నటులతో ఆ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ధురంధర్ సీక్వెల్ విజయంతో జోరు మీద ఉన్న ఆదిత్య ధర్ పేరు వినిపిస్తున్న సమయంలో తెలుగు ప్రాజెక్ట్ వార్తలు బయటకు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఇక రామ్ గోపాల్ వర్మతో కలిసి ఆ ప్రాజెక్ట్ నిజంగా ముందుకు వెళ్తుందా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తేలనుంది. అప్పటి వరకు ఆ వార్తలపై ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది.

Tags:    

Similar News