'దురంధర్ 2' దెయ్యం లుక్: మేకప్ మిరాకిలా? గ్రాఫిక్సా? AI వాడారా?
ముఖ్యంగా బాత్రూమ్ నేపథ్యంలో వచ్చే ఆ సన్నివేశం ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించింది. ఆ వికృత రూపాన్ని చూసి జనం డిస్ట్రబ్డ్ విజువల్ అని కితాబిచ్చేస్తున్నారంటే అది ఎంత అద్భుతంగా పండిందో అర్థం చేసుకోవచ్చు.;
అదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన `దురంధర్ 2` బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధిస్తున్న వసూళ్ల గురించి.. మేకింగ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ నటించిన ఒక `దెయ్యం` సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా బాత్రూమ్ నేపథ్యంలో వచ్చే ఆ సన్నివేశం ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించింది. ఆ వికృత రూపాన్ని చూసి జనం డిస్ట్రబ్డ్ విజువల్ అని కితాబిచ్చేస్తున్నారంటే అది ఎంత అద్భుతంగా పండిందో అర్థం చేసుకోవచ్చు.
చాలా మంది ఈ సీన్ కోసం అధునాతన AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లేదా భారీ గ్రాఫిక్స్ వాడారని అనుకున్నారు. కానీ.. దాని వెనక అసలు నిజం బయటపడటంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇది ఏఐ మ్యాజిక్ కాదు.. కేవలం మేకప్ ఆర్టిస్ట్ చేసిన అద్భుతం. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ప్రీతిషీల్ సింగ్ దీనికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను షేర్ చేయడంతో అసలు గుట్టు వీడింది.
రణవీర్ సింగ్‌ను `ఘోస్ట్ బోర్న్ ఫ్రమ్ షాడోస్`గా మార్చడానికి మేకప్ టీమ్ గంటల తరబడి శ్రమించింది. ముఖంపై ఒక్కో పొరను సహజంగా పెయింట్ చేస్తూ ఆ భయంకరమైన రూపాన్ని తీసుకొచ్చారు. డిజిటల్ యుగంలో కూడా విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడకుండా.. పాత పద్ధతిలో మేకప్‌తోనే ఇంతటి భీతి గొలిపే రూపాన్ని సృష్టించడం విశేషం. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌కు ఇది ఒక నిదర్శనం. అతడు ఆ సన్నివేశంలో ఆర్టిస్టు రూపం సహజంగా ఉండాలని కోరుకున్నారు.
నటుడిగా రణవీర్ సింగ్ పడ్డ కష్టం కూడా తక్కువేమీ కాదు. గంటల తరబడి ఓపికగా కూర్చుని ఆ మేకప్‌ను వేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అతడి అంకితభావాన్ని చూసి అభిమానులు సలామ్ కొడుతున్నారు. సీజీఐ అని పొరబడ్డ వారు కూడా ఇప్పుడు రణవీర్ ఓపికను.. ప్రీతిషీల్ ప్రతిభను వేనోళ్ల పొగుడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
సినిమాలో ఈ సీన్ కేవలం భయపెట్టడానికే కాదు... దీని వెనక చాలా మీనింగ్ కూడా ఉంది. డ్రగ్స్ ప్రభావంలో ఉన్న స్నేహితుడికి రణవీర్ పాత్ర ఒక చీకటి దెయ్యంలా కనిపిస్తుంది. డ్రగ్ అడిక్ట్ మానసిక స్థితిని కళ్లకు కట్టేలా చూపించడానికి ఈ లుక్‌ను వాడారు. హాలీవుడ్ స్థాయిలో ఉన్న ఈ మేకింగ్ చూస్తుంటే భారతీయ సినిమా సాంకేతికంగా ఎంత ఎదిగిందో అర్థమవుతోంది. ముఖ్యంగా సినిమా అనే కళకు మేకప్ ఆర్టిస్టుల అవసరం ఎంతైనా ఉందని ఇది నిరూపించింది. శంకర్ - కమల్ హాసన్, శంకర్- విక్రమ్ లాంటి దిగ్గజాల కలయికలో ఇలాంటి అద్భుతమైన మేకప్ విన్యాసాలు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిత్యాధర్ - రణ్ వీర్ సింగ్ జోడీ మేకప్ ప్రయోగాలు గొప్ప చర్చకు దారి తీసాయి.