‘మర్డర్’ సినిమా ప్రకటన.. రాంగోపాల్ వర్మపై కేసు

Update: 2020-07-04 12:10 GMT
మిర్యాలగూడ పరువు హత్యపై సినిమా తీస్తున్నానని ఇటీవలే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణయ్, అమృత ప్రేమకథ.. అమృత తండ్రి మారుతీరావు కక్షతో అల్లుడు ప్రణయ్ ని చంపించడం నేపథ్యంలో ‘మర్డర్’ సినిమా ప్రకటనను చేశాడు.

అయితే రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై చనిపోయిన ప్రణయ్ తండ్రి బాలస్వామి కోర్టుకు ఎక్కాడు. ఈ సినిమాలో తన కొడుకు హత్యను చూపిస్తారని.. కేసును ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఆయన కోర్టును ఆశ్రయించాడు. ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు తాజాగా మిర్యాలగూడ పోలీసులను రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఈ సినిమా నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

దళితుడైన యువకుడు ప్రణయ్ ని తన కూతురు అమృత ప్రేమ పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో హత్య చేయించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరువాత జైలు శిక్ష అనుభవించిన మారుతీరావు.. విచారణలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఈ క్రమంలోనే సంచలనమైన వీరిగాథను రాంగోపాల్ వర్మ జూన్21 ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ పేరుతో సినిమా ప్రకటించారు. ఓ తండ్రి అమితమైన ప్రేమ ఎలాంటి విషాద పరిణామాలకు దారితీస్తుందో చూపిస్తానన్నారు. దీనిపై అమృత ఇప్పటికే అభ్యంతరం తెలుపగా.. ఆమె మామ కోర్టు ఎక్కడంతో వివాదం ముదిరింది.
Tags:    

Similar News