ప్ర‌ఖ్యాత న‌ట‌శిక్ష‌కుడు దేవ‌దాస్ క‌న‌కాల మృతి

Update: 2019-08-02 12:29 GMT
సీనియర్‌ నటుడు.. ప్ర‌ఖ్యాత‌ న‌ట శిక్ష‌కుడు దేవదాస్‌ కనకాల(74) మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయ‌న‌ అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. నేటి (శుక్ర‌వారం) మ‌ధ్యాహ్నం ఆయ‌న క‌న్ను మూశారని డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. దేవ‌దాస్ క‌న‌కాల అన్న పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప‌రిశ్ర‌మ‌లో పేరు ప్ర‌ఖ్యాతులున్న న‌టుడు.. న‌ట శిక్ష‌కుడు. స‌హాయ న‌టుడు రాజీవ్‌ కనకాల తండ్రిగా అంద‌రికీ సుపరిచితం.

దేవదాస్‌ కనకాల ఇనిస్టిట్యూట్ - హైద‌రాబాద్ అంటే ఎవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు. పూణె ఫిల్మ్‌ ఇన్‌ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన తొలితరం నటుడిగా దేవదాస్‌ కనకాల స్వ‌యంగా ఇనిస్టిట్యూట్ స్థాపించి కొన్ని వంద‌ల వేల మందికి న‌ట‌న‌లో శిక్ష‌ణ నిచ్చారు. వాళ్లంతా సినీటీవీ రంగంలో న‌టులుగా ఉపాధి పొందుతున్నారు. ప‌లువురు అగ్ర హీరోలు సైతం దేవ‌దాస్ క‌న‌కాల వ‌ద్ద న‌ట‌న‌లో మెళ‌కువ‌లు నేర్చుకున్నారు. చిరంజీవి- రాజేంద్రప్రసాద్‌- రజనీకాంత్  సహా పలువురు అగ్ర‌హీరోల‌కు ఓనమాలు నేర్పిన గురువు దేవ‌దాస్ క‌న‌కాల‌. ఆయ‌న శిక్ష‌ణ‌లోనే న‌టుడిగా రాటు దేలిన వార‌సుడు రాజీవ్ క‌న‌కాల ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎంతో బిజీ.

గతేడాది ఫిబ్రవరిలో దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీ దేవి కనకాల మృతి చెందారు. ఏడాది నాటికే ఆయ‌న మృతి చెంద‌డం క‌న‌కాల ఫ్యామిలీకి పెద్ద సెట్ బ్యాక్. దేవదాస్‌ కనకాల స్వ‌గ‌తం ప‌రిశీలిస్తే.. 30 జూలై 1945లో కాకినాడ స‌మీపంలోని కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జన్మించారు. ఆయ‌న‌ స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. తండ్రి కనకాల తాతయ్య నాయుడు ఫ్రెంచి పరిపాలనలో ఉన్న యానాంలో ఎమ్మెల్యే అయ్యారు. దేవ‌దాస్ క‌న‌కాల తల్లి మహాలక్ష్మమ్మ. ఆయ‌న‌కు రాజీవ్ కనకాల తో పాటు కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. కుమారుడు రాజీవ్ క‌న‌కాల టీవీ యాంక‌ర్ సుమను వివాహమాడిన సంగ‌తి గురించి తెలిసిందే. అలాగే కుమార్తె శ్రీ‌ల‌క్ష్మి డా.పెద్ది రామారావును పెళ్లాడారు.

    

Tags:    

Similar News