కొత్త ఏడాది భయపెట్టడానికి సిద్ధమవుతున్న కోలీవుడ్!

ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది.. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా సినిమాలు చేస్తే మంచి విజయం సాధిస్తారు అనడంలో సందేహం లేదు.;

Update: 2026-01-02 17:30 GMT

ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది.. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా సినిమాలు చేస్తే మంచి విజయం సాధిస్తారు అనడంలో సందేహం లేదు. ఇక ప్రేక్షకుడు ఈమధ్యకాలంలో తన అభిరుచిని మార్చుకోవడమే కాకుండా మంచి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కువగా యాక్షన్, థ్రిల్లర్, ఫీల్ గుడ్ చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. అలా అన్ని సినిమా పరిశ్రమలు కూడా కేవలం ప్రేక్షకుడిని మెప్పించడానికి పనిచేస్తాయి అన్న విషయం అందరికీ తెలుసు.

ఇటు కాలానికి తగ్గట్టుగా కూడా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. అలా గత కొన్ని సంవత్సరాలుగా యాక్షన్ , థ్రిల్లర్ తో పాటు ఫీల్ గుడ్ చిత్రాలపై దృష్టి సారించిన కోలీవుడ్ సినీ పరిశ్రమ అప్పుడప్పుడు కొన్ని హారర్ చిత్రాలు చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ గత ఏడాది చెప్పుకోదగ్గ హారర్ సినిమాలయితే ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈసారి ఏకంగా మూడు హారర్ చిత్రాలతో మెప్పించడానికి సిద్ధమవుతోంది కోలీవుడ్ సినీ పరిశ్రమ. వాస్తవానికి గత ఏడాది 280 కి పైగా చిత్రాలు ఒక్క కోలీవుడ్ సినీ పరిశ్రమ నుండే వచ్చాయి. అయితే అందులో కేవలం 30 సినిమాలు మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. అలా మొత్తంగా గత ఏడాది 2000కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది కోలీవుడ్ సినీ పరిశ్రమ.

అయితే ఈసారి రూట్ మార్చాలని కంకణం కట్టుకున్నారు. రాఘవ లారెన్స్, సుందర్. సి వంటి డైరెక్టర్లు. అందుకే ఈసారి పరిస్థితిని పూర్తిగా మార్చబోతున్నారు. హారర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యారు. ముఖ్యంగా మూడు హారర్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన కాంచన 4. కాంచన ఫ్రాంచైజీలో భాగంగా కోలీవుడ్లో నమ్మకమైన బాక్సాఫీస్ బ్రాండ్ గా కొనసాగుతోంది. అయితే ఈసారి కాంచన4 పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే, నోరా ఫతేహీ లాంటి స్టార్ సెలబ్రిటీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు..ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న మరో హారర్ చిత్రం డెమోంట్ కాలనీ 3. కాంచన, అరణ్మనై చిత్రాలు లగా కాకుండా ఈ ఫ్రాంచైజీ కామెడీ కంటే కాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కి ప్రసిద్ధి చెందింది. డెమోంట్ కాలనీకి సీక్వెల్ సెట్ చేయలేకపోయినా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు 2024లో డెమోంట్ కాలనీ2 తో బలమైన కథను చూపించి, మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పార్ట్ 3 తో అంతకుమించి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తయిందని నివేదికలు చెబుతున్నాయి. వేసవి విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుండి నూతన సంవత్సర పోస్టర్ని కూడా విడుదల చేశారు.

ఈ ఏడాది ప్రేక్షకులను భయపెట్టడానికి కోలీవుడ్ నుంచి వస్తున్న మూడవ చిత్రం అరణ్మనై 5. పార్ట్ 2, పార్ట్ 3 లకు మిశ్రమ స్పందన లభించినా.. పార్ట్ 4 తో సుందర్ సి భారీ విషయాన్ని అందుకున్నారు. ఈ సినిమా దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా విజయం తర్వాత మూకుత్తి అమ్మన్ 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సుందర్ సి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అరణ్మనై 5 ను ప్రారంభించాలని భావిస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది ఆఖరున విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఈ మూడు సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మూడు చిత్రాలు మంచి విజయం సాధిస్తే గనుక కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News