అతిగా వాడితే విగ‌ట త‌ప్ప‌దు!

ఇప్ప‌టికే రానా ఓ సమ్మిట్లో ఓపెన్ గా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏఐ అనేది భాష‌ను నిశ్వ‌బ్దంగా మార్చేస్తోంద‌న్నారు.;

Update: 2026-02-17 22:30 GMT

దేనికైనా కొంత ప‌రిమితి ఉంటుంది. ఆ ప‌రిమితి దాటి వ్య‌వ‌హ‌రిస్తే విగ‌ట పుడుతుంద‌న్న‌ది అంతే వాస్త‌వం. ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటిల్ జెన్స్ అన్ని రంగాల్లో విరివిగా వాడ‌కంలోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖంగా సినిమా రంగంలో ఏఐ వినియోగం మామూలుగా లేదిప్పుడు. వాడుకున్న వాళ్ల‌కు వాడుకున్నంత అన్న‌ట్లు ఏఐని మార్చేసారు. న‌టుడు లేకుండానే ఆ న‌టుడు ఉన్న‌ట్లు క్రియేట్ చేసి సీన్ పూర్తి చేస్తున్నారు. మ్యూజిక్ రంగంలోనూ ఏఐని వాడుతున్నారు. సృజ‌నాత్మ‌క‌త విభాగంలోనూ ఏఐ అవ‌స‌ర‌మైన‌ సూచ‌న‌లు, స‌ల‌హాలు అందిస్తోంది.

ఇంకా టెక్నిక‌ల్ గా ర‌క‌ర‌కాల రిఫరెన్స్ ల్ గా ఏఐ వాడ‌కంలోకి వ‌చ్చేసింది. కానీ సినిమా రంగంలో ఏఐ అతిగా లేదా నియంత్రణ లేకుండా వాడితే తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్ప‌టికే రానా ఓ సమ్మిట్లో ఓపెన్ గా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏఐ అనేది భాష‌ను నిశ్వ‌బ్దంగా మార్చేస్తోంద‌న్నారు.

దీన్ని ఒక టూల్ లా వాడుకుంటే? ప‌నులు వేగంగా పూర్త‌వుతాయి. కానీ స్టోరీ టెల్లింగ్ వంటివి పూర్తిగా ఏఐకి వ‌దిలేస్తే సినిమా త‌న ఉనికినే కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. అలాగే ఏఐ వినియోగం వ‌ల్ల ఇప్ప‌టికే సినిమా నిర్మాణంలో మాన‌వ శ్ర‌మ త‌గ్గుతోంది.

ఎంట్రీ లెవల్ ఉద్యోగాల‌పై ప్ర‌భావం ప‌డింది. ఎడిటింగ్, రొటోస్కోపింగ్, కలర్ గ్రేడింగ్ వంటి విభాగాల్లో ప్రాథమిక పనులు చేసే యువ టెక్నీషియన్ల అవసరం లేకుండా పోతోంది. ఏఐ సహాయంతో వేల సంఖ్యలో వర్చువల్ క్రౌడ్ ను సృష్టించవచ్చు. దీనివల్ల షూటింగ్‌లలో జూనియర్ ఆర్టిస్టుల ప్రాధాన్యత తగ్గుతోంది. సినిమా అనేది కేవ‌లం విజువ‌ల్స్ మాత్ర‌మే కాదు. భావోద్వేగాల స‌మ్మేళ‌నం. ఏఐ గత సినిమాల డేటా ఆధారంగా కథలను లేదా దృశ్యాలను తయారు చేస్తుంది. దీనివల్ల సినిమాల్లో కొత్తదనం తగ్గి, అంతా ఫార్ములా ప్రకారం సాగుతున్నట్లు అనిపించవచ్చు.

ఒక న‌టుడు ప‌లికించే హావ‌భావాల్లోని లోతును లేదా ద‌ర్శ‌కుడి విజ‌న్ లోని సూక్ష్మ భేదాలను ఏఐ పూర్తిస్థాయిలో ప్రతిబింబించలేదు. దీనివల్ల సినిమాలు నిర్జీవంగా మారే ప్రమాదం ఉంది. న‌టుల అనుమ‌తి లేకుండా? వారి ముఖాల‌ను, వాయిస్ ల‌ను వాటటం ఇప్ప‌టికే స‌మ‌స్య‌గా మారింది. భ‌విష్య‌త్ లో స్టార్ హీరోల డిజిటల్ క్లోన్ల ను సృష్టించే అవ‌కాశం ఉంది. వారు షూటింగ్‌కు రాకపోయినా సినిమాలు తీసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల నటుల లైక్‌నెస్ హక్కుల విషయంలో వివాదాలు తలెత్తుతాయి.

అనుమతి లేకుండా ఇతరుల పనిని ఏఐ వాడుకోవడం వల్ల ఒరిజినల్ క్రియేటర్లకు అన్యాయం జరుగుతోంది. ఇప్ప‌టికే ఉన్న చాలా సినిమా డేటాను ఏఐ వినియోగించుకుంటుంది. దీంతో కాపీరైట్, మేధో సంప‌తి వివాదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఏఐ రాసిన స్క్రిప్ట్ లేదా కంపోజ్ చేసిన మ్యూజిక్ కు అస‌లు క‌ర్త ఎవ‌రు? అన్న‌ది తేల్చ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. సినిమా అనేది ఓ అద్భుతం. అలాంటి సినిమా అంతా ఓ సాప్ట్ వేర్ తోనే జ‌రుగుతుంద‌ని తెలిస్తే ప్రేక్ష‌కులు వెండి తెర‌పై చూసే దానికి ఇచ్చే విలువ త‌గ్గే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News