ఐసియులో సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్
బాలీవుడ్ లెజెండరీ స్క్రీన్ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.;
బాలీవుడ్ లెజెండరీ స్క్రీన్ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. సలీమ్ సాబ్ వయసు 90. అనారోగ్యం కారణంగా ఆయనను ఆస్పత్రిలో చేర్చారని తెలియగానే చిత్ర పరిశ్రమ కలతకు గురైంది.
తాజా సమాచారం మేరకు.. ఆయన ఐసియులో ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు తీవ్ర నీరసంతో ఉన్నట్లు సమాచారం. వైద్యులు ఆయనను ఐసీయూలో పర్యవేక్షిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ ఆధ్వర్యంలో న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్లతో కూడిన బృందం చికిత్స అందిస్తోంది. డాక్టర్ పార్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సలీమ్ ఖాన్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నారు. అయితే నిశిత పరిశీలనలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తండ్రి ఆరోగ్యం విషమించిందని తెలియగానే సల్మాన్ ఖాన్ తన షూటింగ్ షెడ్యూల్స్, ఇతర పనులన్నింటినీ రద్దు చేసుకుని ఆస్పత్రికి చేరుకున్నారు. సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన సోదరులు అర్బాజ్, సోహైల్, సోదరి అల్విరా, అర్పితా ఖాన్, ఆయుష్ శర్మ అందరూ ఆస్పత్రి వద్దే ఉన్నారు.
సల్మాన్ ఖాన్ ఆస్పత్రి లోపలికి వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. వైద్యులు, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ప్రస్తుతానికి పూర్తి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే 18ఫిబ్రవరి ఉదయం 11 గంటలకు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయనున్నాయి. సలీమ్ సాబ్ త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
సలీమ్ ఖాన్ బాలీవుడ్‌లో ఒక శకానికి అధిపతిగా ఏలిన రచయిత. ఆయన జావేద్ అక్తర్ తో కలిసి మిరాకిల్స్ చేసారు. షోలే, జంజీర్, దీవార్ వంటి క్లాసిక్ చిత్రాలను అందించారు. ఆరోజుల్లో హీరోలు, దర్శకనిర్మాతలను కూడా అదుపులో ఉంచి శాసించిన రచయితలుగా వారికి గొప్ప గుర్తింపు ఉంది.