ఇండియన్ సినిమాలో రాక్ సాలిడ్ ఫ్యామిలీమ్యాన్
ఇండియన్ సినిమా హిస్టరీలో రాక్ సాలిడ్ పెర్ఫామర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. రాకింగ్ స్టార్ గా అతడికి బిరుదును ఇచ్చి అభిమానులు అతడి హార్డ్ హిట్టింగ్ యాక్షన్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.;
ఇండియన్ సినిమా హిస్టరీలో రాక్ సాలిడ్ పెర్ఫామర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. రాకింగ్ స్టార్ గా అతడికి బిరుదును ఇచ్చి అభిమానులు అతడి హార్డ్ హిట్టింగ్ యాక్షన్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ఇచ్చిన కిక్కు అది. అయితే రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ 2 తర్వాత అంతగా కంగారు పడటం లేదు. అందివచ్చిన అవకాశాన్ని తెలివిగా పాన్ వరల్డ్ కి చేర్చడం ఎలానో అన్వేషించాడు. ప్రస్తుతం అతడు టాక్సిక్, రామాయణం లాంటి క్రేజీ పాన్ వలర్డ్ సినిమాలతో దూసుకొస్తున్నాడు. అతడు భారతదేశంలోని అన్ని రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న సినిమాల్లో నటిస్తున్నాడు.
అయితే అతడు ఎంతటి రాక్ సాలిడ్ పర్సనాలిటీ అయినా కానీ అంతకుమించి గొప్ప ఫ్యామిలీమ్యాన్ అనే విషయం అభిమానులకు తెలుసు. అతడు ఎప్పుడూ తన భార్య పిల్లలతో విలువైన సమయాన్ని గడుపుతాడు. ఈసారి కొత్త సంవత్సర వేడుకల కోసం అతడు రాధికా పండిట్, పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీతో ఎంతో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపాడు.
ప్రపంచం కళ్లు చెదిరే ఆనందకరమైన వేడుకలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సమయంలో అందమైన జంట యష్ -రాధిక పండిట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. ఆ పోస్ట్‌లో యష్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యష్ తన భార్య పిల్లలతో పర్ఫెక్ట్ ఫ్యామిలీమ్యాన్ ని తలపించాడు.
``ప్రేమ- కాంతితో నిండిన క్షణం`` అంటూ యష్ -రాధిక పండిట్ 2026కి స్వాగతం పలికారు. ఈ సంవత్సరం అందరి జీవితాలలో ప్రేమ - కాంతితో నిండి ఉండాలని ఆకాంక్షించారు.
యష్ -రాధిక పండిట్ ప్రేమకథ
నిజానికి యష్ - రాధిక జంట `నందగోకుల` అనే టీవీ షో సెట్స్‌లో కలుసుకున్నారు. అలాగే ఇద్దరి నడుమా కెమిస్ట్రీ బలపడింది. జంటగా కలిసి నటించారు. డ్రామా, మొగ్గిన మనసు, సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్, మిస్టర్ అండ్ మిసెస్ రామచారి వంటి చిత్రాలలో కలిసి నటించారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న తర్వాత డిసెంబర్ 2016లో వివాహం చేసుకున్నారు. ఈ జంట ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. కుమార్తె ఐరా (2018లో జన్మించింది), కుమారుడు, యథర్వ్ (2019లో జన్మించాడు) ఈ జంటకు ఉన్నారు.
10తలల రావణుడు..
యష్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అతడు తదుపరి మోస్ట్ అవైటెడ్ `టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్` చిత్రంలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి తదితరులు నటించారు. నితీష్ తివారీ `రామాయణం`లోను కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అతడు పది తలల రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. నమిత్ మల్హోత్రా ఈ చిత్రానికి నిర్మాత. రణబీర్ కపూర్, సన్నీడియోల్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, లారా దత్తా, రవి దూబే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. `రామాయణం: పార్ట్ 1` షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. రాధిక పెళ్లి తర్వాత నటనా కెరీర్ ని పూర్తిగా విడిచిపెట్టారు. హుడుగరు, బహద్దూర్, అద్దూరి, డ్రామా, మిస్టర్ అండ్ మిసెస్ రామచారి వంటి ప్రముఖ చిత్రాలలో తన నటనతో రాధిక పండిట్ పాపులరైంది.