'ధైర్యం.. శక్తి.. ప్రతీకారం'.. 'ధురంధర్' సీక్వెల్ తెలుగు ట్రైలర్ చూశారా?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్‌ చిత్రానికి సీక్వెల్‌ గా వస్తున్న ధురంధర్‌: ది రివెంజ్‌ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.;

Update: 2026-03-08 07:34 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్‌ చిత్రానికి సీక్వెల్‌ గా వస్తున్న ధురంధర్‌: ది రివెంజ్‌ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాది చివర్లో విడుదలైన ధురంధర్‌ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొదటి భాగం కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల కాగా, ఈసారి ధురంధర్‌: ది రివెంజ్‌ ను పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు మేకర్స్. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తుండగా.. తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఒక రోజు ముందు హిందీ ట్రైలర్‌ ను విడుదల చేయగా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొచ్చారు. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ పాత్రలో మరోసారి పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే ఈసారి ఆయన ఒక్క పాత్రలో కాకుండా రెండు విభిన్న రోల్స్ లో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

జస్కిరత్‌ తో పాటు హమ్జా అనే మరో పాత్రలో ఆయన కనిపించనున్నారు. ముఖ్యంగా ఊరమాస్ లుక్‌ లో కనపడడం విశేషం. భారీ యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ స్టంట్స్, గ్రాండ్ విజువల్స్ ట్రైలర్‌ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌ లు, విజువల్ ట్రీట్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఈసారి స్టోరీని మరింత పవర్‌ ఫుల్‌ గా తీసుకువచ్చినట్లు అర్థమవుతోంది.

'ఇకపై పాకిస్తాన్ భవిష్యత్తును హిందుస్థాన్ నిర్ణయిస్తుంది', 'దేనినైనా ఓర్చుకునే వాడు మగాడు', 'ధైర్యం.. శక్తి.. ప్రతీకారం' వంటి డైలాగ్స్ ట్రైలర్‌ కు హైలైట్‌ గా నిలిచాయి. సినిమాలో పలువురు ప్రముఖ నటులు ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారి రోల్స్ సినిమాకు మరింత బలం చేకూర్చనున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌, షార్ప్ డైలాగ్స్‌, హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. యాక్షన్‌, ఎమోషన్‌, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించినట్లు సమాచారం. జియో స్టూడియోస్ సమర్పణలో బీ 62 స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆ మూవీ.. ఉగాది పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది. మొత్తానికి టీజర్‌, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ ను తీసుకువచ్చాయి. మరి ధురంధర్‌ మ్యాజిక్‌ ను సీక్వెల్ మళ్ళీ రిపీట్ చేస్తుందా? బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అన్నది వేచి చూడాలి.




Tags:    

Similar News