కార్గిల్ యుద్ధంపై టాప్ -5 చిత్రాలు: దేశ‌భ‌క్తి స్ఫూర్తిని ర‌గిలించిన సైనికుల వీర‌గాధ‌లు

1999లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం మన దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం.

Update: 2026-07-26 18:30 GMT

1999లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం మన దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం. హిమాల‌యాల‌లో మైనస్ డిగ్రీల చలిలో.. ప్రాణాలకు తెగించి పోరాడిన భారతీయ సైనికుల అసమాన ధైర్యసాహసాలు- త్యాగాలు వెండితెరపై ఎన్నో దృశ్యకావ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ సైనిక శౌర్యాన్ని ప్రతిబింబించిన షేర్షా, ఎల్.ఓ.సి: కార్గిల్, గుంజన్ సక్సేనా, లక్ష్య, ఆపరేషన్ సేఫ్డ్ సాగర్ వంటి చిత్రాలు ప్రేక్షకులలో ఎలాంటి భావోద్వేగాలను రేకెత్తించాయో విశ్లేషిస్తే.....

కార్గిల్ యుద్ధ నేపథ్యంతో వచ్చిన అత్యంత ఆదరణ పొందిన చిత్రాలలో `షేర్షా` (2021).. `ఎల్.ఓ.సి: కార్గిల్` (2003) ప్రముఖమైనవి. పరమవీర చక్ర పురస్కార గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత ఆధారంగా తెరకెక్కిన `షేర్షా` సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా నటన... పాయింట్ 5140, పాయింట్ 4875 ల ఆక్రమణ దృశ్యాలు ప్రేక్షకులను తీవ్ర ఉద్వేగానికి గురిచేసాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో క‌థానాయ‌కుడి అమరత్వానికి థియేటర్లలోని ప్రజలు కంటతడి పెడుతూనే, `యే దిల్ మాంగే మోర్` అనే నినాదంతో దేశభక్తి పూరిత గర్వంతో రగిలిపోయారు. అలాగే జె.పి. దత్తా దర్శకత్వంలో వచ్చిన `ఎల్.ఓ.సి: కార్గిల్` చిత్రం యుద్ధం తీవ్రతను, సరిహద్దుల్లో జవాన్ల నిరంతర పోరాటాన్ని కళ్లకు కట్టి దేశవ్యాప్తంగా సైనికులపై అపారమైన గౌరవాన్ని పెంచింది.

యుద్ధరంగంలో కేవలం సైనికులే కాకుండా వాయుసేన పాత్ర ఎంత కీలకమైనదో చాటిచెప్పిన చిత్రాలు `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` కూడా మ‌హిళా సైనికురాలి కోణంలో ఉద్వేగాల్ని రేకెత్తించింది .. అలాగే విడుదల‌కు సిద్ధ‌మైన `ఆపరేషన్ సేఫ్డ్ సాగర్` (2026) పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.. యుద్ధ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా పైలట్ గుంజన్ సక్సేనాగా జాన్వీ కపూర్ నటించగా..ఈ చిత్రం ప్రేక్షకులలో ముఖ్యంగా మహిళల్లో స్ఫూర్తిని నింపింది. గాయపడిన 900 మందికి పైగా సైనికులను రక్షించే సన్నివేశాలు ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేకెత్తించాయి. అదేవిధంగా.. కార్గిల్ యుద్ధంలో `గోల్డెన్ యారోస్` స్క్వాడ్రన్ పైలట్ల సాహసాలను ఆవిష్కరిస్తున్న `ఆపరేషన్ సేఫ్డ్ సాగర్` వెబ్ సిరీస్ వైమానిక దళం చూపిన తెగింపును ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తూ.. ఉత్సాహాన్ని నింపుతోంది.

సరిహద్దు పోరాటంతో పాటు ఒక యువకుడి అంతర్మథనాన్ని, బాధ్యతను ఆవిష్కరించిన చిత్రం `లక్ష్య` (2004). హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం భారతీయ యువతపై బలమైన ముద్ర వేసింది. లక్ష్యం లేకుండా తిరిగే ఒక సాధారణ యువకుడు సైన్యంలో చేరి కార్గిల్ యుద్ధంలో పాయింట్ 5179ని కైవసం చేసుకునే క్రమంలో పరిణతి చెందే తీరు ప్రేక్షకులకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చింది. ఈ చిత్రం చూసిన తర్వాత వేలాది మంది యువకులు భారత సైన్యంలో చేరడానికి ప్రేరణ పొందారంటే ఆ సినిమా రేకెత్తించిన స్ఫూర్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

వీటితో పాటు `కురుక్షేత్ర` (2008), `టాంగో చార్లీ` (2005) వంటి చిత్రాలు కూడా కార్గిల్ యుద్ధం భయానక ప‌రిస్థితుల్ని, తోలోలింగ్ పర్వతాలపై జరిగిన ఘోర పోరాటాలను ఆవిష్కరించాయి. మొత్తంమీద ఈ కార్గిల్ యుద్ధ ఆధారిత చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించకుండా.. సరిహద్దుల్లో మన భార‌త‌దేశ‌ భద్రత కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా చేశాయి. థియేటర్లలో ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, సైన్యం పట్ల అమితమైన గౌరవాన్ని నింపుతూ ఈ చిత్రాలు అజేయమైన విజయాన్ని సాధించాయి.

Tags:    

Similar News