ట్రెండీ టాక్: 50 ప్లస్ హీరోలకు 'ఇరుముడి' నేర్పిన పాఠం
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథా బలం ఉన్న తండ్రి పాత్రను ఎంచుకోవడం వల్ల ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా.. నటుడిగా అతడి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
సినిమా రంగంలో స్టార్ హీరోల వయసు మారుతున్న కొద్దీ వారి పాత్రల ఎంపికలోనూ పరిణతి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరోసారి ప్రూవ్ అయింది. తమ వయసుకు తగిన పాత్రలు చేస్తేనే ఎంత పెద్ద హీరోనైనా ప్రేక్షకులు తెరపై ఆదరిస్తారని.. లేదంటే ప్రేక్షకుల నుంచి ఘోరమైన తిరస్కారం తప్పదని గత పరిణామాలు స్పష్టం చేసాయి. రవితేజ 'ఇరుముడి' ఇప్పుడు బిగ్ డిబేట్ కి కారకం. పెళ్లీడుకొచ్చిన కూతుళ్లు ఉన్నప్పటికీ ఇంకా యువ హీరోయిన్లతో రొమాంటిక్ లవ్‌స్టోరీల్లో నటిస్తున్న 60 ప్లస్ హీరోలకు ఇదొక పెద్ద కనువిప్పు లాంటి పరిణామం. మన పరిశ్రమలో ఉన్న 50 ప్లస్ హీరోలు ఇకపై రొమాంటిక్ పాత్రలను పక్కన పెట్టి.. కథకు బలమైన డాడీ పాత్రల్లో.. బాధ్యతాయుతమైన రోల్స్‌లో నటించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇప్పటివరకు ఇద్దరేసి హీరోయిన్లతో ప్రేమలో నిండా మునిగి, రొమాన్స్ చేయడంలో బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ఇరుముడి` చిత్రంలో మొదటిసారి కూతురిని అమితంగా ప్రేమించే బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో నటించారు. తెరపై ఆయనలోని ఈ విప్లవాత్మక మార్పును ప్రేక్షకులు ఎంతో మనసారా స్వాగతించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథా బలం ఉన్న తండ్రి పాత్రను ఎంచుకోవడం వల్ల ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా.. నటుడిగా అతడి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ఈ విజయంతో 50 ప్లస్, 60 ప్లస్ హీరోలందరూ ఇకపై తమ వయసుకు తగిన పాత్రలనే ఎంచుకోవాల్సి ఉంటుందనే సూచన స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇండస్ట్రీ దిగ్గజ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లు ఇప్పటికే చాలావరకు తమ వయసుకు తగినట్లు పరిణతి ఉన్న విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ దూసుకెళుతున్నారు. నాగార్జున సైతం ప్రయోగాత్మక కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 'ఇరుముడి' తరహాలో భావోద్వేగాలతో కూడిన తండ్రి పాత్రలు ఈ సీనియర్ హీరోలందరికీ కూడా వందశాతం సూటబుల్ ఆప్షన్‌గా మారుతున్నాయి.
అలా కాకుండా పాత పద్ధతిలోనే ఇంకా హీరోయిన్లతో లవ్వాయణాలు, రొమాంటిక్ కామెడీలు చేస్తూ పోతే నేటి ప్రేక్షకులు నిర్ధయంగా తిరస్కరిస్తున్న ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. నేటి మాస్ ఫ్యాన్స్ కూడా ఓటీటీలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు, లైవ్ సిరీస్ లు విపరీతంగా చూస్తూ పూర్తిగా అప్‌గ్రేడ్ అయ్యారు. వారి అభిరుచులు మారడంతో రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలు బెడిసికొడుతున్నాయి. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు కూడా గ్లామర్ పాత్రలను పక్కన పెట్టి తమ వయసుకు తగ్గ పరిణతి ఉన్న తండ్రి లాగానో లేదా వయసుకు తగ్గ పాత్రల్లోను నటిస్తుండటం గమనార్హం.
మొత్తానికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్టార్ హీరోలు తమ పంథాను మార్చుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. హాలీవుడ్ హీరోల మాదిరిగా మారుతున్న కాలానికి తగినట్లు తమ ఇమేజ్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటూ.. వైవిధ్యమైన పాత్రలతో మైలేజ్ పెంచుకోవడమే సీనియర్ హీరోలకు సరైన మార్గం. కేవలం డ్యాన్సులు, రొమాన్స్ చుట్టూ తిరగకుండా బలమైన భావోద్వేగాలు ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటేనే బాక్సాఫీస్ వద్ద విజయం సొంతమవుతుందని నిరూపణ అయింది. ఇరుముడి నేర్పిన పాఠం టాలీవుడ్ 50 ప్లస్ హీరోలకు నిజంగానే కలిసి వస్తుందని ఆశిద్దాం.