విజయ్ నీడ నుంచి సిగ్మా బయటపడేదెలా?

సిగ్మా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి సినిమా కంటే జేసన్ సంజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

Update: 2026-09-16 01:30 GMT

సిగ్మా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి సినిమా కంటే జేసన్ సంజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ కుమారుడిగా అతని తొలి సినిమా కావడంతో తమిళనాడులో సహజంగానే ఆ క్యూరియాసిటీ ఉంది. సేలం ఈవెంట్‌లో కూడా టీవీకే నినాదాలు వినిపించాయి. సందీప్ కిషన్ కూడా విజయ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో హీరోగా సందీప్ ఉన్నా, బయట మాత్రం సిగ్మా ఇంకా విజయ్ కొడుకు సినిమా అనే పేరుతోనే ఎక్కువగా తిరుగుతోంది.

జేసన్‌కు ఇది మొదటి సినిమా కాబట్టి ఆ పేరు మొదట్లో ఉపయోగపడుతుంది. విజయ్ ఫ్యాన్స్ కూడా సినిమా ఎలా ఉందో చూడాలనే ఆసక్తి చూపిస్తారు. కానీ రిలీజ్ తర్వాత కథ మారాలి. జేసన్ దర్శకత్వం ఎలా చేశాడు, సందీప్ క్యారెక్టర్ ఎలా ఉంది, సినిమా ఎంతవరకు వర్కవుట్ అయింది అనే విషయాలే క్లిక్ కావాలి. లేదంటే మొత్తం ప్రచారం విజయ్ పేరు చుట్టూనే తిరిగి, సినిమాలో ఉన్న వాళ్లకు రావాల్సిన గుర్తింపు కొంచెం వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది.

సందీప్ కిషన్‌కు మాత్రం సిగ్మా చాలా ఇంపార్టెంట్. తమిళంలో రాయన్, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాల్లో కనిపించినా అవి పూర్తిగా ఆయన మీద నడిచిన సినిమాలు కావు. ఇప్పుడు సిగ్మాలో మాత్రం మెయిన్ హీరో. పైగా తెలుగులో కూడా గత కొంతకాలంగా ఒక పర్ఫెక్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ కొడుకు సినిమా అనే ట్యాగ్‌తో ఓపెనింగ్ రావచ్చు. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సందీప్ గురించీ మాట్లాడుకుంటేనే కెరీర్ కు ఉపయోగం.

సినిమా టీమ్ కూడా ఇప్పటివరకు జేసన్ చుట్టూనే ఎక్కువ ప్రచారం చేస్తోంది. అతను ఎలా వర్క్ చేశాడు, మొదటి సినిమా ఎలా హ్యాండిల్ చేశారు, కుటుంబం నుంచి ఎవరు సపోర్ట్ చేశారు అనే విషయాలే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. సందీప్, ఫరియా అబ్దుల్లా పాత్రల గురించి మాత్రం ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 2 రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ హీరో క్యారెక్టర్, కథ మీద కూడా ఫోకస్ పెరగాల్సి ఉంటుంది.

ఇక్కడ విజయ్ పేరు సిగ్మాకు మైనస్ కాదు. మొదటి సినిమా చేస్తున్న దర్శకుడికి దొరికే పెద్ద అడ్వాంటేజ్ అదే. కానీ సినిమా థియేటర్లలోకి వెళ్లిన తర్వాత కూడా అదే ఒక్క ఐడెంటిటీగా మిగిలిపోతే సందీప్‌కు అంత ఉపయోగం ఉండదు. జేసన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలి, సందీప్ హీరోగా మంచి ఫలితం అందుకోవాలి. రెండూ జరిగితేనే సిగ్మా విజయ్ షాడో నుంచి బయటపడుతుంది. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ అవుతోంది. అప్పటివరకు విజయ్ పేరు ఎంత వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ మొదటి షో తర్వాత కంటెంట్ క్లిక్కవ్వాలి. ఇక సందీప్ కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News