తెలుగు అమ్మాయిల జోరు - సిల్వర్ స్క్రీన్ రికార్డులు!

ఒకప్పుడు టాలీవుడ్‌లో నటీమణుల ఎంపిక విషయంలో పూర్తిగా పరభాషా నటులదే హవా ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భామలే స్టార్ హీరోయిన్లుగా రాణించేవారు.

Update: 2026-07-26 19:30 GMT

ఒకప్పుడు టాలీవుడ్‌లో నటీమణుల ఎంపిక విషయంలో పూర్తిగా పరభాషా నటులదే హవా ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భామలే స్టార్ హీరోయిన్లుగా రాణించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ సమీకరణాలు అంతే వేగంగా మారుతున్నాయి. గ్లామర్ పాత్రలకు.. చిన్నపాటి పరిమిత వేషాలకే పరిమితమైన తెలుగు అమ్మాయిలు ఇప్పుడు అద్భుతమైన నటనతో సిల్వర్ స్క్రీన్‌ను శాసిస్తున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం అందం మాత్రమే కాదు. నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని ముందుకెళ్ల‌డ‌మే.

వైష్ణవి చైతన్య, శ్రీ గౌరీ ప్రియ, ఫ‌రియా అబ్దుల్లా వంటి యువ నటీమణులు వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర దక్షిణాది ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతూ పక్క రాష్ట్రాల హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. వైష్ణవి చైతన్య సహజమైన నటనతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. భావోద్వేగాలను పండించడంలో ఆమె చూపించే ప్రతిభ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అలాగే శ్రీ గౌరీ ప్రియ వంటి నటీమణులు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఈ భామ‌లు చేస్తున్న ప్రయోగాలు టాలీవుడ్ చిత్రసీమకు కొత్త ఊపును ఇస్తున్నాయి. మరోవైపు డ్యాన్స్‌లతో, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న శ్రీలీల తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ నటనతో పాటు అంకితభావం ఎంత ముఖ్యమో నిరూపిస్తోంది. కొన్ని అవ‌కాశాల‌ను శ్రీలీల కావాల‌నే వ‌దుల‌కుంటుంది. అలాగే `రాజు వెడ్స్ రాంబాయి` భామ‌ తేజ‌స్వీ రావు వంటి నటీమణులు కూడా విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువ‌వుతున్నారు. కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డంలో జోష్ చూపిస్తున్నారు.

తెలుగు నటీమణుల విజయాలు వారి వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే అద్దం పట్టడం లేదు. భవిష్యత్తులో మరిన్ని స్థానిక ప్రతిభావంతులకు పరిశ్రమలో తలుపులు తెరుచుకునేలా చేస్తున్నాయి. గ్లామర్ హద్దులను దాటి, పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సత్తా తెలుగు అమ్మాయిలకు కూడా ఉందని నిరూపిస్తున్నారు. మేకర్స్ కూడా స్థానిక నటీమణులకు పెద్దపీట వేయడానికి విజయాలే కారణం అవుతున్నాయి.

తెలుగు అమ్మాయిల సరికొత్త జోరు పరిశ్రమ రూపురేఖలను మార్చే దిశ‌గా అడుగులు వేయ‌డానికి దోహ‌ద ప‌డుతుంది . కథానాయికల పాత్రలకు జీవం పోస్తూ రికార్డులను తిరగరాస్తున్న నవశకం నటీమణుల ప్రయాణం రాబోయే తరాలకు స్పూర్తిదాయకమైన దారి చూపుతుందనడంలో సందేహం లేదు. సిల్వర్ స్క్రీన్‌పై వారి ఆధిపత్యం రాబోయే రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది.

Tags:    

Similar News