"స్టాండ్ విత్ హర్".. సాయి దుర్గా తేజ్ కొత్త పోరాటం!
ప్రపంచవ్యాప్తంగా నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు, మహిళల గౌరవాన్ని గుర్తిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.;
ప్రపంచవ్యాప్తంగా నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు, మహిళల గౌరవాన్ని గుర్తిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే మహిళల భద్రత , గౌరవాన్ని కాపాడడంలో ఎప్పుడూ ముందుండే మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ Sai Durgha tej) నేడు 2026 "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా "#స్టాండ్ విత్ హర్" అంటూ ఒక కొత్త పోరాటానికి నాంది పలికారు. ఇక పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం..
స్టాండ్ విత్ హర్..
సాయి దుర్గ తేజ్.. తెలంగాణ ప్రభుత్వం, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా చేపట్టిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ లో భాగస్వామి అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన.. ఈ ఏడాది పొడవునా సాగే కార్యక్రమంలో మహిళలకు ఆపద కలిగినప్పుడు పురుషులు మౌనంగా ఉండకుండా అండగా నిలబడాలని అవగాహన ఈ కార్యక్రమం ద్వారా కల్పించనున్నారు. ఇకపోతే గతంలో "డార్క్ కామెడీ" పేరుతో పిల్లలపై జరుగుతున్న అసభ్యకర కామెంట్స్ , వేధింపులపై స్టాండ్ తీసుకొని ధైర్యంగా గళమెత్తిన సాయి దుర్గ తేజ్ ఇప్పుడు మహిళల కోసం ఆయన చేస్తున్న పోరాటానికి నేటిజన్స్ సైతం హాట్సాఫ్ అంటున్నారు. కేవలం సినిమాలలోనే కాకుండా నిజజీవితంలో కూడా బాధ్యత కలిగిన పౌరుడిగా వ్యవహరిస్తున్న తీరుకి సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
మహిళా భద్రతే ధ్యేయం..
ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తూ.." సాయి దుర్గా తేజ్ లాంటి వారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు.. ప్రతి పురుషుడు మహిళా భద్రత పట్ల సామాజిక బాధ్యత తీసుకోవాలి" అంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు . ఈ మేరకు సాయి దుర్గా తేజ్ పంచుకున్న వీడియోలో ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కూడా అభిమానులు ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే సాయి దుర్గా తేజ్ ఇప్పుడు మహిళల కోసం స్టాండ్ తీసుకోవడంతో ఆయన వ్యక్తిత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆలోచింపచేస్తున్న సాయి దుర్గా తేజ్ కామెంట్స్..
సాయి దుర్గా తేజ్ మహిళల గురించి మాట్లాడుతూ.. " నాకు ఒక కోరిక ఉంది. ప్రతి మగాడికి ఉండే కోరికే. నాకు ఆడపిల్ల ఉంటే బాగుండు అని.. కానీ ఎక్కడో ఏదో భయం.. ఎందుకంటారు? ఒక మనిషి వంటింట్లో వంట చేస్తున్నట్లు ఊహించుకో.. ఒక మనిషి బట్టలుతుకుతున్నట్లు ..ఒక మనిషి సోఫాలో కూర్చున్నట్టు.. ఇంకొక మనిషి డబ్బులు లెక్క పెడుతున్నట్టు.. ఇక దేనికి ఎవరిని ఊహించుకున్నారో నీకు తెలుసు.. నాకు తెలుసు.. అందుకే భయం. ఆడపిల్లగా పుడితే తను ఎంత సర్దుకుపోవాలో.. ఎంత జాగ్రత్తగా ఉండాలో..ఎంత స్వేచ్ఛను కోల్పోవాలో .. ఎంత ప్రూవ్ చేయాలో.. అనే భయం ఉంది. ఇంట్లో, ఆఫీసులో, మన గర్ల్ ఫ్రెండ్, భార్య ఇలా ప్రతి ఒక్కరు కూడా.. వేరొకరి ఆడపిల్లే కదా.. మన ఆడపిల్ల కోసం మనం ఆలోచిస్తున్నామంటే.. వారి గురించి కూడా మనం ఆలోచించాలి కదా" అంటూ అమ్మాయిల గురించి , వారి భద్రత గురించి సాయి దుర్గ చేసిన ప్రతి కామెంట్ మనిషి అనే వాడిని ఆలోచింపచేస్తున్నాయి. మొత్తానికి అయితే అమ్మాయిల కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాయి దుర్గ తీసుకున్న స్టాండ్ ప్రతి మగాడు తీసుకోవాలని ఆశిద్దాం..