రాజీవ్-సుమ కుటుంబంలో విషాదం

Update: 2018-02-03 06:50 GMT
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల-యాంకర్ సుమ కుటుంబంలో విషాదం నెలకొంది. రాజీవ్ తల్లి లక్ష్మీదేవి కన్నుమూశారు. ఆమె వయసు 78 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లక్ష్మీదేవి సినీ పరిశ్రమలో బాగానే పాపులర్. స్వయంగా ఆర్టిస్టు అయిన ఆమె ఎన్నో నాటకాల్లో నటించింది. కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. అన్నింటికీ మించి తన భర్త దేవదాస్ కనకాలతో కలిసి ఆమె పదుల సంఖ్యలో ఆర్టిస్టుల్ని తయారు చేసింది. వీళ్లిద్దరూ కలిసి ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చారు.

11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీదేవి.. నాట్యకారిణిగా.. నటిగా పేరు తెచ్చుకున్నారు. మొదట్లో మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా శిక్షణ ఇచ్చారు. శుభలేఖ సుధాకర్.. సుహానిసి లాంటి ప్రముఖ నటీనటులు లక్ష్మీదేవి దగ్గర శిక్షణ తీసుకున్నవాళ్లే. ‘పోలీస్ లాకప్’ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో.. ‘కొబ్బరిబోండాం’లో రాజేంద్రప్రసాద్‌ తల్లి పాత్రలో లక్ష్మీదేవి నటించారు. 1971లో దేవదాస్‌ కనకాలను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు రాజీవ్‌ కనకాల.. కూతురు శ్రీలక్ష్మి ఉన్నారు. కోడలు సుమ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటక రంగ ప్రముఖుడు. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. సినీ ప్రముఖులు రాజీవ్ కనకాల ఇంటికి చేరుకుంటున్నారు.
Tags:    

Similar News