కోటి కోటిన్నర తక్కువే తీసుకుంటా- రాజమౌళి

Update: 2015-07-05 11:30 GMT
టాలీవుడ్‌లో అపజయమే లేని ఏకైక దర్శకుడు రాజమౌళి. తాను తీసిన అన్ని సినిమాలతోనూ నిర్మాతలకు భారీగా లాభాలు మిగిల్చాడతను. మరి అలాంటి దర్శకుడు ఎంత పారితోషకం తీసుకుంటాడు అన్న ఆసక్తి జనాల్లో ఉంది. ఐతే ఇప్పటిదాకా ఎప్పుడూ రాజమౌళి పారితోషకం గురించి కచ్చితమైన సమాచారం లేదు. గత కొన్ని సినిమాల నుంచి లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. బాహుబలి విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే కచ్చితంగా రాజమౌళి పారితోషకం ఇంత అని చెప్పేవాళ్లు మాత్రం లేరు. మరి ఈ ప్రశ్న నేరుగా రాజమౌళినే అడిగితే ఏం చెప్పాడో చూడండి.

''అందరికంటే ఎక్కువ పారితోషకం తీసుకోవాలనే కోరిక నాకూ ఉంటుంది. అలాగని సినిమాకు భారీగా ఖర్చుపెట్టి నేనూ భారీగా తీసుకోలేను. ఇప్పటివరకు చేసిన సినిమాలకు మార్కెట్‌ విలువ కంటే కోటి, కోటిన్నర తక్కువే తీసుకున్నా. నేను వదులుకున్న డబ్బుల్ని మళ్లీ సినిమా కోసమే ఖర్చు పెట్టించా. నా పారితోషకం విషయంలో రాజీ పడతా కానీ.. సినిమా విషయంలో మాత్రం కాదు. నాతో ఎవరైనా సినిమా తీయాలంటే ముందు సినిమాపైన విపరీతమైన ప్రేమ ఉండాలి. బడ్జెట్‌ ఎంతైనా పర్వాలేదు అని వస్తే వెంటనే నమస్కారం పెట్టేసి పంపించేస్తా. సినిమా చర్చల్లో పారితోషకం ఆరేడు స్థానాల్లో ఉంటుంది. అలాగని బెన్‌హర్‌ లాంటి సినిమా చేస్తాం. ఉచితంగా తీసి పెడతావా అన్నా తీయను. సినిమాలు సంఘ సేవ కోసం చేయను, అలాగని డబ్బు కోసమూ చేయను. కొంత డబ్బు, చాలా ప్రేమ.. అందుకే సినిమా'' అని చెప్పాడు రాజమౌళి. అన్నీ చెప్పాడు కానీ.. పారితోషకం ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు జక్కన్న.

Tags:    

Similar News